ఇండియాలో శ్రీలంక టూర్‌కు కౌంట్‌డౌన్‌

13:29 - November 14, 2017

ఢిల్లీ : ఇన్‌స్టంట్‌ వన్డే, టీ20 ఫార్మాట్లలో తిరుగులేని టీమిండియా సొంతగడ్డపై మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. శ్రీలంకతో  3 ఫార్మాట్లలో 3 మ్యాచ్‌ల సిరీస్‌కు కొహ్లీ అండ్‌ కో సై అంటే సై అంటోంది. ఓటమంటూ లేకుండా శ్రీలంక టూర్‌ ముగించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లను చిత్తు చేసి జోరు మీదుంది. శ్రీలంకను సొంతగడ్డపై  బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగబోతోంది.

ఇండియాలో శ్రీలంక టూర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.  సొంతగడ్డపై భారత్‌ శ్రీలంకతో 3 ఫార్మాట్లలోనూ సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమైంది. ట్రెడిషనల్‌ టెస్ట్‌ , ఇన్‌స్టంట్‌ వన్డే , ఫటా ఫట్‌ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లలో...టీమిండియా లంకతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

ఓటమంటూ లేకుండా శ్రీలంక పర్యటన ముగించి చరిత్ర సృష్టించిన టీమిండియా... సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లను చిత్తు చేసి జోరు మీదుంది. శ్రీలంకను సొంతగడ్డపై  సైతం బ్రౌన్‌ వాష్‌ చేయడమే  లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగబోతోంది.

ఇన్‌స్టంట్‌ ఫార్మాట్లలో ఎదురులేని ఇండియా...టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే. సొంతగడ్డపై ఫార్మాట్‌ ఏదైనా   ప్రత్యర్ధి జట్లకు అవకాశమే ఇవ్వని భారత్‌....బలహీనమైన శ్రీలంక జట్టుపై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్‌ వంటి పటిష్టమైన జట్లే  సొంతగడ్డపై భారత్‌ను అధిగమించడంలో విఫలమయ్యాయి. 

భారత్‌లో శ్రీలంక టూర్‌ నవంబర్‌ 16న ఆరంభమై డిసెంబర్‌ 24తో ముగియనుంది.3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ ఆతిధ్యమివ్వనుంది. నవంబర్‌ 24 నుంచి నాగ్‌పూర్‌ విదర్భ స్టేడియం వేదికగా రెండో టెస్ట్‌, డిసెంబర్‌ 3 నుంచి ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టెస్ట్‌తో సిరీస్‌ ముగుస్తుంది.

ఆ తర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో ఇండియా-శ్రీలంక తలపడతాయి. డిసెంబర్‌ 10న ధరమ్‌శాలలోని హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్డేడియం వేదికగా జరుగనున్న తొలి వన్డేతో ఇండియా-శ్రీలంక 3వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.డిసెంబర్‌ 13న మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో 2వ వన్డే జరుగనుంది. 17న విశాఖపట్నం ఎసీఎ,వీడిసీఎ స్టేడియం వేదికగా జరుగనున్న 3వ మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగుస్తుంది. 

డిసెంబర్‌ 20 నుండి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి టీ20కి కటక్‌లోని బారాబతి క్రికెట్‌ స్టేడియం  ఆతిధ్యమివ్వబోతుండగా...డిసెంబర్‌ 22న ఇండోర్‌లోని హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనుంది. డిసెంబర్‌ 24న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగనున్న 3వ టీ20 మ్యాచ్‌తో శ్రీలంక టూర్‌కు తెరపడనుంది. 

2 నెలల ముందే శ్రీలంక టూర్‌లో టెస్ట్‌,వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌ స్వీప్‌ చేసిన కొహ్లీ అండ్‌ కో....సొంతగడ్డపై సైతం సేమ్‌ ఫీట్‌ రిపీట్‌ చేయాలని తహతహలాడుతోంది. మరి పవర్‌ఫుల్‌ టీమ్‌ కాంబినేషన్‌తో పాటు సొంత గడ్డపై తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత్‌....బలహీనంగా ఉన్న శ్రీలంక జట్టును మరోసారి బ్రౌన్‌ వాష్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

Don't Miss