'మానవా ఇక సెలవ్'...

19:37 - February 28, 2018

ముంబై : అతిలోకసుందరి శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దివి నుంచి భువికి దిగి వచ్చి వెండితెరను రాణిలా ఏలిన అందాలనటి మళ్లీ దివికేగింది. మరపురాని పాత్రలతో అర్థ శతాబ్దం పాటు అశేష అభిమానగణాన్ని అలరించి, కోట్లాది హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న ఆమె... మానవా ఇక సెలవ్ అంటూ స్వర్గానికి సాగిపోయింది. శ్రీదేవి అంతిమయాత్రలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 
శ్రీదేవి భౌతికకాయానికి సినీ ప్రముఖుల నివాళులు 
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన శ్రీదేవి అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర సాగింది. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు శ్మశానవాటిక వద్దకు పోటెత్తారు. అంతకు ముందు సెలబ్రేషన్స్ క్లబ్ నుంచి విల్లేపార్లే వరకు సాగిన శ్రీదేవి అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా భారీ ఎత్తున పాల్గొని.. శ్రీదేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు అంతిమయాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ముంబై పరిసరాలు కిక్కిరిసిపోయాయి. 
ఎరుపురంగు చీర కంచిపట్టు చీరతో శ్రీదేవి అలంకరణ 
అంతిమ సంస్కారం సందర్భంగా శ్రీదేవిని ఆమెకు ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీర కంచిపట్టు చీరతో అలంకరించారు. ఎప్పుడూ అందంగా కనిపించడం ఆమెకు అలవాటు. దీంతో చివరిక్షణాల్లోనూ శ్రీదేవిని అలాగే ముస్తాబు చేశారు. అభిమానుల మనసుల్లో నుంచి ఆ మనోహర రూపం చెదిరిపోకుండా ఉండేలా ఆమె కుటుంబసభ్యులు చర్యలు తీసుకున్నారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించిన వాహనాన్ని.. శ్రీదేవికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, లిల్లీపూలతో అలంకరించారు. అంతిమయాత్ర వాహనంలో శ్రీదేవి భౌతికకాయంతో పాటు ఆమె కుటుంబీకులు ఉన్నారు. 
శ్రీదేవి కడసారి చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
అనంతలోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి చివరిచూపు కోసం స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పోటెత్తారు. హేమామాలిని, ఐశ్వర్యారాయ్, జయాబచ్చన్, సుస్మితాసేన్, మాధురి దీక్షిత్, అక్షయ్‌ కుమార్, టబు, అజయ్ దేవగన్, కాజోల్, అర్జున్ కపూర్, సంజయ్‌ లీలా బన్సాలి, సారా అలీఖాన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్, రీతేష్ దేశ్‌ముఖ్, అర్భాజ్ ఖాన్, ఇషా డియోల్, కరణ్‌ జోహార్, ఫరా ఖాన్, సుభాయ్ ఘాయ్ తదితరులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అలాగే రజనీకాంత్, కమల్‌ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అర్జున్ సహా పలువురు దక్షిణాది నటులు శ్రీదేవి భౌతికకాయాన్ని వద్ద అశ్రునివాళి అర్పించారు.  
ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు  
ఇక సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విల్లే పార్లేలోని సేవా సమాజ్‌ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. కడసారి శ్రీదేవిని చూసేందుకు ముంబై తరలివచ్చిన అభిమానులంతా బాధాతప్త హృదయాలతో వెనుదిరిగారు. 
శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలు రద్దు 
ఇక శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని గ్రీన్‌ ఏకర్స్‌ సొసైటీ హోళీ వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించింది. తన నటనతో యావత్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న శ్రీదేవి మృతికి సంతాపంగా హోళీ వేడుకలను రద్దు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. 

 

Don't Miss