టికెట్ రాకపోతే ఆత్మాహుతి చేసుకుంటా - శంకరమ్మ...

09:50 - October 11, 2018

సూర్యాపేట : హుజూర్ నగర్ టికెట్ టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి దక్కుతుంది ? తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ...ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ శంకరమ్మ కంటతడి పెట్టడం కలకలం రేగింది. ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మాత్రం ఏకంగా ఆత్మాహుతి చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని..సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారంటూ తన పలు ఆరోపణలు గుప్పించారు. తనకు కేసీఆర్, కేటీఆర్ మద్దతు ఉందని...పార్టీ కోసం తాను చాలానే పనిచేశానని చెప్పుకొస్తున్నారు. 

శాసనసభ రద్దు చేసిన అనంతరం గులాబీ బాస్ 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ కీలకంగా ఉన్న హుజూర్‌నగర్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్‌లో ఉంచారు. దీనితో పలువురు తమకు టికెట్ కేటాయించాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు.  2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన శంకరమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించలేకపోయారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గాలుగా విడిపోయారు. స్థానికంగా ఉన్న సైదిరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలున్నాయని ప్రచారం జరుగుతోంది. టి.టీపీసీసీ అధ్యక్ష్డుడు ఉత్తమ్‌తో శంకరమ్మ పోటీ పడుతారా ? గెలుపొందుతారా ? అనే దానిపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ శంకరమ్మ డిమాండ్‌కు అధిష్టానం తలొగ్గుతుందా ? గులాబీ దళపతి ఈ సమస్యకు ఎలా చెక్ పెడుతారో వేచి చూడాలి. 

Don't Miss