శ్రీకాంత్ కిడ్నాప్ కథ సుఖాంతం

07:57 - July 20, 2017

ఢిల్లీ : తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌ ఈనెల 6న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అతడిని కిడ్నాప్‌ చేశాడు. అతడిని వదిలిపెట్టాలంటే 5కోట్ల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌ పెట్టాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. శ్రీకాంత్‌గౌడ్‌ కిడ్నాప్‌ కావడంతో ఓలా క్యాబ్‌ యాజమాన్యం 7న ప్రీత్‌విహార్‌ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే కిడ్నాపర్‌ వారికి చిక్కకుండా చుక్కలు చూపించాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం శ్రీకాంత్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్నట్టు గుర్తించారు.

ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు
కిడ్నాపర్లు తలదాచుకున్న ప్రదేశాన్ని గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న కిడ్నాపర్స్‌ హరిద్వార్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కిడ్నాపర్లపై కాల్పులు జరిపారు. ఓ కిడ్నాపర్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది. శ్రీకాంత్‌ను మాత్రం సురక్షితంగా కాపాడారు.శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు సురక్షితంగా కాపాడారని తెలియడంతో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మోహినిమల్ల వీధిలోని ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ పోలీసులు తమ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడించారని తెలిపారు. ఇక స్థానిక ఎమ్మెల్యే డీకె అరుణ శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో ఆనందాన్ని పంచుకున్నారు.మొత్తానికి శ్రీకాంత్‌గౌడ్‌ సురక్షితంగా కిడ్నాపర్ల చెరనుంచి బయటపడడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా కాపాడిన ఢిల్లీ పోలీసులకు శ్రీకాంత్‌ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Don't Miss