13 ఏళ్ల తరువాత 'చిరు'..'బాలయ్య'..విజేత ఎవరో ?

12:07 - January 10, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు విడుదల కావడం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ చిత్రాలు విడుదలవుతుంటాయి. అందులో కొందరివి హిట్టు కాగా..మరికొందరివి ఫట్టవుతుంటాయి. ఈసారి సంక్రాంతికి మాత్రం టాప్ హీరోస్ 'చిరంజీవి'..'బాలకృష్ణ' చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ఆ హీరోలకు ప్రతిష్టాత్మకమే. దీనితో వారి అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన పోటీ మళ్లీ రసవత్తరమైన పోటీ జరుగుతుండడం విశేషం. 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'...'చిరంజీవి' 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. 11వ తేదీ 'ఖైదీ' సినిమా విడుదలవుతుండగా 'గౌతమి..' 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గతంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పోటీ జరిగిందో తెలుసుకుందాం...
1987లో 'చిరంజీవి' 'దొంగమొగుడు'తో రాగా 'బాలకృష్ణ' 'భార్గవరాముడు'తో ముందుకొచ్చారు. వసూళ్ల పరంగా 'చిరు' చిత్రం పై చేయిగా నిలిచింది. తరువాత ఏడాది 'చిరంజీవి'..'మంచిదొంగ' తో...'బాలకృష్ణ' 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' పోటీ పడింది. ఈ రెండు చిత్రాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరిదిగా పై చేయిగా సాగాయి. 1997 సంక్రాంతి 'చిరంజీవి' 'హిట్లర్'..'బాలకృష్ణ' 'పెద్దన్నయ్య'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండూ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. వసూళ్ల మొత్తంగా 'పెద్దన్నయ్య' పై చేయి సాధించిందని టాక్. 1999లో 'స్నేహం కోసం' అంటూ 'చిరంజీవి'...'సమరసింహారెడ్డి' గా 'బాలకృష్ణ' ముందుకొచ్చారు. ఈ రెండింటి మధ్య పన్నెండు రోజుల తేడా ఉంది. 2000 సంక్రాంతి పోరులో 'బాలకృష్ణ' 'వంశోద్దారకుడు'తో...'అన్నయ్య' గా 'చిరంజీవి' ముందుకొచ్చారు. ఇందులో 'అన్నయ్య' పై చేయి సాధించాడు.

13 ఏళ్లకు..
2001లో 'చిరంజీవి' 'మృగరాజు' అంటూ ముందుకొచ్చారు. జనవరి 11న ఈ సినిమా విడుదలైంది. అదే రోజున 'బాలకృష్ణ' 'నరసింహనాయుడు' చిత్రం రిలీజైంది. 'మృగరాజు' పరాజయం చెందగా 'నరసింహనాయుడు' పై చేయిగా నిలిచింది. 2004లో 'బాలకృష్ణ' 'లక్ష్మీ నరసింహ'గా..'చిరంజీవి' 'అంజి' చిత్రాలు పోటీ పడ్డాయి. ఈసారి కూడా 'బాలయ్య'దే పై చేయిగా నిలిచింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు..అంటే 13 ఏళ్లకు సంక్రాంతి బరిలో 'చిరంజీవి'..'బాలకృష్ణ' చిత్రాలు నిలువనున్నాయి. 'బాలకృష్ణ' చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చారిత్రక కథాంశంతో తెరకెక్కగా 'చిరంజీవి' రీమెక్ చిత్రం కావడం విశేషం. మరి ఈ బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి.

Don't Miss