ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ లో తెలుగు రాష్ట్రాలు హవా..

21:20 - July 10, 2018

ఢిల్లీ : ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌గా నిలువగా.. తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌లు నిలిచాయి.
తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌,రెండో స్థానంలో తెలంగాణ
ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిలక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను డీఐపీపీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్‌, ఐదో స్థానంలో గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ 98.42 శాతం స్కోర్‌ సాధించగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణ 98.33 శాతం స్కోర్‌ సాధించింది.

టాప్‌ అచీవర్స్‌గా 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు
డూయింగ్‌ ఆఫ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో ఆయా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా కేంద్రం గుర్తించింది. 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా, 90 నుంచి 95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను అచీవర్స్‌గా... 80 నుంచి 90 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ఫాస్ట్‌ మూవర్స్‌గా... 80 శాతం లోపు సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలను ఆస్పైరర్స్‌గా గుర్తించారు. ఈ సంస్కరణలను వంద శాతం సాధించిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జార్ఖండ్‌, గుజరాత్‌లు నిలిచాయి.

టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు
అయితే... టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు, అచీవర్స్‌ జాబితాల్లో ఆరు, ఫాస్ట్‌ మూవర్స్‌ జాబితాలో మూడు, ఆస్పైరర్స్‌ జాబితాలో 18 రాష్ట్రాలు నిలిచాయి. మరోవైపు సంస్కరణల అమలు స్కోర్‌లో ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాల జాబితాలో అసోం, తమిళనాడులకు చోటు లభించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌,.. నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్‌,.. కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్‌,.. పర్యావరణ రిజిస్ట్రేషన్లలో కర్ణాటక,.. భూమి లభ్యతలో ఉత్తరాఖండ్‌,.. పన్నుల చెల్లింపులో ఒడిశా... పర్యవేక్షణ అమలులో మధ్యప్రదేశ్‌... ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర వంద శాతం స్కోర్లు సాధించాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు టాప్‌గా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss