ఊరును వణికిస్తున్న వింతవ్యాధి..

18:00 - January 10, 2017

సంగారెడ్డి: ఓ వింత వ్యాధి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. వింత వ్యాధితో అభం శుభం తెలియని చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వింత లక్షణాలతో చిన్నారుల చేతి వేళ్లు వికారంగా మారుతుండడంతో ఇప్పుడా ఆగ్రామం భయంతో వణికిపోతుంది. ఇంతకీ ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ వింత జబ్బేంటి ? వాచ్‌ దిస్‌ స్టోరీ.

సంగారెడ్డి జిల్లా శెల్గిరాలో వింతవ్యాధి
ఇక్కడ మీరు చూస్తున్న వంకర్లు తిరిగిన వేళ్లతో కనిపిస్తున్న ఈ చిన్నారులది సంగారెడ్డి జిల్లా శెల్గిరా గ్రామం. కొన్నేళ్లుగా ఈ గ్రామంలో అంతుచిక్కని ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడిన చిన్నారుల చేతి వేళ్లు ఇలా వంకర్లు తిరుగుతున్నాయి. ఈ రోజు ఆరోగ్యంగా ఉండే వారు మరుసటిరోజు కల్లా ఇలా మారిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ వింత జబ్బు ఇప్పుడు చిన్నారులకే కాదు పెద్దవారికి కూడా సోకడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

శ్రావణి , నిఖిత, అశ్విణిలకు సోకిన వింత వ్యాధి
ఈ వింత వ్యాధి మరింత మందికి వ్యాపిస్తోంది. శెల్గిరా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శ్రావణి , నిఖిత, అశ్విని అనే ఐదవ తరగతి విద్యార్ధులకు ఈ వ్యాధి వింత వ్యాధి సోకింది. దీనిపై స్ధానిక వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేశారు. కానీ ఈ వ్యాధి సోకడానికి కారణమేమిటో తెలుసుకోలేక పోయారు. దీంతో ఆందోళనకు గురైన పిల్లల తల్లిదండ్రులు వివిధ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చుచేసుకుంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఈ వ్యాధి ఏమిటో నిర్ధారణ కాలేదు.

గతంలోఈ వ్యాధితో కొంతమందికి అంగవైకల్యం
గతంలో కూడా ఈ వ్యాధి సోకి కొంతమంది అంగవైకల్యానికి గురయ్యారు. ఇంకొంత మంది వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే మరికొంత మంది ఈ వింత వ్యాధితో మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని తాగునీటిపై నామమాత్రపు పరీక్షలు చేసిన అధికారులు ఈ నీరు పశువులు కూడా తాగడానికి పనికిరావని నిర్ధారించారు. కానీ ఇప్పటికీ కూడా ఈ నీటినే అధికారులు గ్రామంలో సరఫరా చేస్తున్నారు.

వింత వ్యాధిపై వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం
ఈ వింత వ్యాధి విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు ఈ గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు చేయలేదు. పోషకాహార లోపంతో ఇలా జరుగుతోందని స్ధానిక వైద్య సిబ్బంది కొన్ని మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ తంతు వార్తల్లో వచ్చినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారే...తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2016 లో జరిగిన ఉపఎన్నిక సమయంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి ఈ వింత వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపాలని శెల్గిరా గ్రామస్తులు కోరుతున్నారు.

 

Don't Miss