వింత ఆచారం...

18:31 - December 21, 2016

నిర్మల్ : గ్రామ ప్రజలంతా కలిసి.. దరిద్రలక్ష్మిని సాగనంపారు..   పాత చీపుర్లు.. పాత బట్టలు.. తట్టలు...చెప్పులతో... డప్పు వాయిద్యాలతో కలిసికట్టుగా పొలిమేర దాటించారు.  పంటలు ఇంటికొచ్చే సమయానికి జేష్ఠా దేవిని బయటకు పంపించారు. వింతగా ఉన్నా.. ఇది నిజం..
దరిద్రలక్ష్మిని సాగనంపిన గ్రామస్థులు
నిర్మల్‌ జిల్లా.. ఖానాపూర్‌లో మరుగున పడిపోయిన ఓ వింత ఆచారాన్ని గ్రామస్థులు ఇప్పుడు మళ్లీ ఆచరించారు.  తరతరాలుగా సాగి...తర్వాత కాలంలో మరుగున పడిపోయిన ఓ ఆచారం..ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టాలనే లక్ష్యంతో గ్రామస్థులు పాత ఆచారాన్ని మళ్లీ అవలంబించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నాలుగు గంటలకు గ్రామంలోని సుమారు 15 వందల మంది యువకులు... గ్రామపెద్దలు.. డప్పు వాయిద్యాలతో దరిద్ర లక్ష్మీని గ్రామం నుంచి సాగనంపారు. ఇంట్లో ఉన్న పాత చీపురులు.. బట్టలు.. తట్టలు..పాత చెప్పులు పట్టుకుని వెళ్లి గ్రామానికవతల విడిచిపెట్టి వచ్చారు. అనంతరం గ్రామ పొలిమేరలో స్నానాలు చేశారు. అనంతరం ఇంటి నుంచి తెచ్చుకున్న కొత్త బట్టలు ధరించి..ఇంటి గడప వద్ద కొబ్బరికాయ కొట్టి సిరిలక్ష్మికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. 
పాత వస్తువు పొలిమేర అవతల పారవేత
పంటలు పండి...కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకువచ్చే సమయంలో పూర్వీకులు ఈ విధానాన్ని అవలంబించేవాళ్లని గ్రామస్థులు చెబుతున్నారు.. ఇంట్లో ఉండే పనికిరాని.. పాత వస్తువును గ్రామస్థులందరూ పొలిమేర అవతల పారేసి వస్తే.. గ్రామానికి పట్టిన దరిద్రం వదిలేస్తుందని నమ్మకమని గ్రామపెద్దలు చెప్పారు. గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మళ్లీ ఈ విధానాన్ని అవలంబించామని చెబుతున్నారు.
20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 
20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఇప్పుడు గ్రామంలో నిర్వహించారు.  కొన్ని ఇబ్బందులున్నా.. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. అయితే ఈ విధానం గమ్మత్తుగా ఉందని యువకులు అంటున్నారు.

 

Don't Miss