డీఎస్సీ ఎప్పుడు...

21:30 - September 11, 2017

ఢిల్లీ : డీఎస్సీపై వరుస ప్రకటనలు ఇస్తూ వాయిదాలు వేస్తున్న తెలంగాణ సర్కార్‌పై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. సెప్టెంబర్‌లో డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి మళ్లీ గడువు అడగడంపై సుప్రీం మండిపడింది. విద్యాశాఖ కార్యదర్శి వెంటనే సుప్రీం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది. ఇటీవలే 8 వేల 792 ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయితే నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ప్రభుత్వం వాయిదాలు వేస్తూవస్తోంది. ఏ పోస్టుకైనా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. కాని ఇప్పటి వరకు డీఎస్సీకి సంబంధించి ఎలాంటి జీవో విడుదల చేయలేదు. ప్రభుత్వం కావాలనే డీఎస్సీపై జాప్యం చేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టెట్‌ ఫలితాలు వచ్చిన రోజునే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కాని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే
కొత్త జిల్లాల ఏర్పాటు వల్లే నియామక ప్రక్రియ ఆలస్యమైందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. కాని ప్రస్తుతం పాత జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఒకసారి పాత జిల్లాలని, మరోసారి కొత్త జిల్లాలని చెప్పడంతో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవోలో తప్పని సరిగా పోస్టులు ఏ ప్రకారం భర్తీ చేస్తారనే అంశం ఉంటుంది. ఈ విషయం బయటికి వస్తే నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ప్రభుత్వం డీఎస్సీ పై అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిరుద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే కేవలం 8 వేల 792 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంపై నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక విద్యార్థుల నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 12వేల మంది విద్యావాలంటీర్లు ఉన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ ఉండాలన్న నిబంధన పాటించినట్లయితే దాదాపు 40వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.

సుప్రీంకోర్టు ఆగ్రహం
ఐదు సంవత్సరాలుగా ఊరిస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌పై తెలంగాణ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహంతోనైనా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Don't Miss