ఏపీలో బంద్ విజయవంతం

21:45 - February 8, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా తెల్లవారుజాము నుంచే అన్ని జిల్లాలలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపైకి వచ్చి.. ఆందోళనలు చేపట్టారు. వినూత్న నిరసనలతో ఏపీకి జరిగిన అన్యాయంపై నినదించారు. బంద్‌లో భాగంగా అన్ని జిల్లాల్లో.. సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, ప్రజా సంఘాల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలతో హోరెత్తించారు. సీపీఎం నేతలు డిపోల్లో బస్సులను అడ్డుకున్నారు. దుకాణాలు, పాఠశాలలు, కాలేజీలు మూయించారు. కేంద్ర తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళనలలో అపశృతులు...
బంద్‌లో భాగంగా.. కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలలో అపశృతులులు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా.. ఏలూరులో ర్యాలీ తీయబోతున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. అలాగే అనంతపురం, పెనుకొండలో ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ రసాభాసగా మారి... వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రీకాకుళలో జిల్లాలో... ముందస్తుగా.. సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు.అలాగే వైసీపీ అధినేత జగన్‌ నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎమ్మెల్యేలు, నాయకులు జిల్లాలలోని బంద్‌లో పాల్గొని.. ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు బంద్‌లో భాగమై... అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లా.. హిందూపురంలో కాంగ్రెస్‌ నేత, పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి కార్యకర్తలతో పాటు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మోదీకి భయపడి ప్రత్యేక హోదాపై మాట్లాడడం లేదని రఘువీరారెడ్డి విమర్శించారు.

మోకాళ్లపై నిలబడి..
అలాగే.. ఏపీకి జరిగిన అన్యాయంపై.. జనసేన పార్టీ నాయకులు తమదైన రీతిలో స్పందించారు. వినూత్న నిరసనలతో.. కేంద్రంపై మండిపడ్డారు. విజయవాడలో మోకాళ్లపై నిలబడి..కేంద్ర వైఖరిని ఎండగట్టగా.. ఏలూరులోని బిర్లా భవన్‌ సెంటర్‌ వద్ద ఆకుకూరలు నములుతూ ఆందోళన చేశారుఏపీ బంద్‌లో తాము సైతం అంటూ జర్నలిస్టులు కదం తొక్కారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఏపీకి కేంద్రం నాలుగేళ్లుగా అన్యాయం చేస్తోందని విమర్శించారు. అలాగే అనంతపురంలో ఐద్వా, కార్మిక సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.  

Don't Miss