బీసీసీఐకి సుప్రీం షాక్..

13:53 - January 2, 2017

ఢిల్లీ : భారతదేశంలోని క్రికెట్ చరిత్రలో సంచలనం చోటు చేసుకుంది. బీసీసీఐపై సుప్రీం కొరడా ఝులిపించింది. ఏకంగా అధ్యక్ష పదవి నుండి అనురాగ్ ఠాకూర్ పై సుప్రీం వేటు పడింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాకూర్ తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగించింది. 2016 జులై 18వ తేదీన లోథా కమిటీ పలు సిఫార్సులను తెలియచేసింది. కానీ లోథా సిఫార్సులను బీసీసీఐ ఏమాత్రం అమలు చేయలేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక ఒక ప్యానెల్ కూడా ఏర్పాటు చేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై బీసీసీఐ పూర్తిగా విఫలం చెందిందని, కోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకో లేదని అనురాగ్ ఠాకూర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. రాజకీయ నేతల జోక్యం ఉండకూడదని, మూడేళ్ల అనంతరం పదవిలో ఉండకూడదని, నిధుల విషయంలో పారదర్శకత పాటించాలని పలు సిఫార్సులను లోథా కమిటీ సూచించింది. కానీ ఈ సిఫార్సులను అమలు చేయలేదు. దీనిపై విచారించిన సుప్రీం పై నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సహాయకులుగా సీనియర్ న్యాయవాదులు పాలీ నారీమన్, గోపాల సుబ్రమణ్యంలను కోర్టు నియమించింది. బోర్డు సభ్యుల ఎంపికపై సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.

Don't Miss