బల్దియాకు ఏ గుర్తింపు వస్తుంది ?

21:00 - February 12, 2018

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది జీహెచ్‌ఎమ్‌సీ. ఒకే సమయంలో వేలాది మందితో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించి గిన్నిస్‌ రికార్డును కైవసం చేసుకునే ప్రయత్నం చేసింది. హైదరాబాద్‌ రాంనగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగర ప్రజలను ఏకం చేసేందుకు సన్నద్ధమైంది GHMC. గుజరాత్‌లోని వడోదరా మున్సిపల్‌ కార్పొరేషన్‌ 5వేల 820 మందితో రోడ్లను శుభ్రం చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ రికార్డును బ్రేక్‌ చేసేందుకు GHMC ఆధ్వర్యంలో నగరంలోని రాంనగర్‌ డివిజన్‌లో 15వేల 320 మంది విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు ఒకేసారి రోడ్లను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మహముద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. భారీ సంఖ్యలో జీహెచ్‌ఎమ్ సి కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

గతేడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. అయితే అన్ని నగరాలతో పోల్చినప్పుడు 22వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది నగరంలోని పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, ఓపెన్‌ యూరినేషన్‌ అంశాల్లో మెరుగుదల సాధించడంతో మెట్రో నగరాల్లో ముంబయి తర్వాత హైదరాబాద్‌కు ఓడిఎఫ్‌గా గుర్తింపు లభించింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో కూడా హైదరాబాద్‌కు మంచి గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో కృషి చేస్తుంది బల్దియా. అందులో భాగంగానే నిర్వహించిన కార్యక్రమంలో హైరేంజ్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ నగరాన్ని అగ్రస్థానంలో నిలుపుకుందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

పారిశుధ్యం విషయంలో GHMC భారీ మార్పులు తీసుకువస్తుందన్నారు బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి. ఈ నెల 15 నుండి 21 వ తేది వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కాంపిటిషన్‌ జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో నిలిచేందుకు సినీతారలు, మంత్రులతో ప్రచారం చేపట్టింది బల్దియా. మరి ఈ ఏడాది GHMCకి ఏ గుర్తింపు దక్కుతుందో వేచి చూడాలి. 

Don't Miss