ఈ స్వీపర్ సేలరీ అక్షరాలా లక్షన్నర!!..

14:45 - October 5, 2018

తూర్పుగోదావరి : నెలంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేకాని ఓ స్వీపర్ కి  జీతం ఎంత వుంటుంది? మహా వుంటే రూ.10,15వేలు వుండొచ్చు. కానీ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా స్వీపర్ కు జీతం ఎంతో తెలుసా? తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇది నమ్మటానికి సాధ్యం కాకపోయినా అది అక్షరాల సత్యం. రాజమహేంద్రవరానికి చెందిన స్వీపర్ కోల వెంకటరమణమ్మ వేతనం అక్షరాలా లక్షన్నర రూపాయలు. వాట్సాప్‌లో షేర్ అవుతున్న ఆమె పే స్లిప్‌ను చూసి చాలామంది ఫేక్ అని కొట్టిపారేశారు. అయితే, అది ఫేక్ కాదని, ఆమె వేతనం రూ.1,47,722 అని తేలింది. ఆమె మాత్రమే కాదు.. ఆమెలా లక్షకుపైగా జీతం తీసుకుంటున్న వారు డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు విద్యుత్ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయి జెన్‌కో, ట్రాన్స్‌ కోలు ఏర్పడ్డాయి. ట్రాన్స్‌ కోలో ప్రాంతాల వారీగా డిస్కమ్‌లు ఏర్పాటు చేశారు. కాగా  సంస్కరణల నేపథ్యంలో ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వడాన్ని తొలగించారు. దీంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఉద్యోగుల్లో భరోసా నింపేందుకు వారి వేతనాలను భారీగా పెంచారు. ఇంక్రిమెంట్ల విషయంలోనూ అంతే భారీ స్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని స్థాయిల ఉద్యోగులకు బ్రహ్మాండమైన వేతనాలు లభిస్తున్నాయి. సర్వీసు బాగా ఉన్న స్వీపర్, అటెండర్ల జీతం ఐదంకెలు దాటిందంటే వారి వేతనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాన్స్‌కో సీఎండీ కంటే 30 ఏళ్ల సర్వీస్ ఉన్న చీఫ్ ఇంజినీర్ వేతనమే ఎక్కువే అంటే ఆశ్చర్యపోక తప్పదు. 
కోల వెంకటరమణమ్మ విషయానికి వస్తే ఆమె 1978లో 16వ ఏట విద్యుత్తు శాఖలో స్వీపర్‌గా చేరారు. 1 ఏప్రిల్ 1981లో ఆమె పర్మినెంట్ ఉద్యోగినిగా మారారు. రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలో స్వీపర్‌గా వెంకట రమణమ్మ  పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైర్ కాబోతున్న ఆమెకు 40 సర్వీస్ అనుభవం వుంది. కాగా ఆమె  సర్వీసుతో పాటు వేతనం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.1.47 లక్షల వేతనం అందుకుంటోంది. ఈమె పే స్లిప్ వాట్సాప్‌లోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఆరా తీయగా, లక్షన్నర వేతనం నిజమేనని తేలింది.

Don't Miss