పథకం ప్రకారమే దాడి : కోమటిరెడ్డి

08:38 - May 19, 2017

హైదరాబాద్ : నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాడిని ఖండిస్తూ..కేసీఆర్‌ సర్కార్‌ను కాంగ్రెస్‌ నేతలు టార్గెట్‌ చేశారు. విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులను సీరియస్‌గా పరగణిస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను వాడి అణచివేయాలనుకుంటే ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెబుతామన్నారు. నల్గొండ ఘటనను స్పీకర్ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో స్పీకర్ మౌనంగా ఉండటం దురదృష్టమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వసూల్ చేస్తామన్నారు. నల్గొండలో రౌడీయిజం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆహ్వానించినందుకే కార్యక్రమానికి వెళ్లానన్నారు. పోలీసులు తనను ఒక్కడినే రమ్మనడంతోనే ఆశ్చర్యం వేసిందన్నారు. పథకం ప్రకారమే తనపై దాడి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

న్యాయ విచారణ జరిపించాలి
నల్గొండ దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేచోట టీఆర్ఎస్ సభలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సమావేశాలుగా మారుస్తున్నారని విమర్శించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించిన ఆయన.. ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన జానారెడ్డి.. కార్యకర్తల కోసం అవసరమైతే జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు.మొత్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాడిని సీఎల్పీ సమావేశం తీవ్రంగా ఖండించింది. దాడి ఘటనను స్పీకర్‌ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

Don't Miss