సంగారెడ్డికి రాహుల్

07:27 - May 19, 2017

రంగారెడ్డి : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్న టికాంగ్రెస్ ఈ స్పీడ్‌ను మరింత పెంచాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైన్, ధర్నాచౌక్ తరలింపు, రైతుల సమస్యలపై ఆందోళన బాట పట్టిన ఆ పార్టీ నేతలు .. ఇప్పుడు వీటికి తెలంగాణ సెంటిమెంట్ ను జోడించేందుకు సిద్ధమయ్యారు.

రిపీట్ కాకూడదని
తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్నా.. ప్రతిపక్షానికే పరిమితం కావడంపై కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఇదే సీన్ భవిష్యత్‌లో రిపీట్ కాకూడదని భావిస్తోంది. దీనికి తోడు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం సాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మరింత అలర్ట్ అవుతోంది. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే రంగంలోకి దించుతోంది. జూన్ 1న సంగారెడ్డి వేదికగా తెలంగాణ ప్రజా గర్జన సభ నిర్వహించాలని టికాంగ్రెస్ నిర్ణయించింది. అందుకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వేదికగా చేసుకోవాలని నిర్ణయించారు. కేసీఆర్ మూడేళ్ల పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడమే ఎజెండాగా సభ నిర్వహిస్తున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవినీతి, నియంతృత్వం, అక్రమాలు టీఆర్ఎస్ ట్రేడ్ మార్క్ గా మారాయని .. ఎన్నో ఆశలతో ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం ఇస్తే కేసీఆర్ ప్రజల ఆశల్ని అడియాశలు చేశారని విమర్శించారు.

ప్రజా గర్జన వేదికగా
ఈ ప్రజా గర్జన వేదికగా రాహుల్ ఇటు కేసీఆర్ అటు మోడీ పాలనను ఎండగట్టనున్నారు. మూడేళ్ల పాలనలో రెండు ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధనాలను ఏకీపారేస్తూ.. తాము ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామో.. ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు. అంతేకాదు మూడేళ్ల కేసీఆర్ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది.

Don't Miss