గ్రామగ్రామానికి టీమాస్ ఫోరం : తమ్మినేని

07:01 - October 13, 2017

 

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ మాస్‌ ఫోరమ్‌ రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై... ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చించారు. టీ మాస్‌ ఫోరమ్‌ ఆవిర్భవించిన మూడు నెలల కాలంలో ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. దీనిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు
ప్రభుత్వ హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శ తమ్మినేని వీరభద్రం అన్నారు. జనవరిలో జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు, ముట్టడి చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే అక్టోబర్‌ 17న జిల్లా.. మండల కేంద్రాల్లో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతులు ఇవ్వాలన్నారు. దేశంలో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. కుల వివక్షతను పెంచిపోషించడంలో.. పెట్టుబడిదారుల పాత్ర చాలా ఉందన్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
ప్రభుత్వాన్ని కదిలించేలా జనవరిలో పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని టీ మాస్‌ ఫోరమ్‌ నిర్ణయించింది. అలాగే కంచె ఐలయ్యపై దాడిని ఖండిస్తూ.. తీర్మానం చేసింది. సమావేశంలో గద్దర్‌, కంచె ఐలయ్య, పీఎల్‌ విశ్వేశ్వరరావు, జేబీ రాజు, అన్ని సంఘాల నేతలు పాల్గొన్నారు.  

Don't Miss