2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న టీటీడీపీ

13:14 - August 9, 2017

హైదరాబాద్ : క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై తెలంగాణ టీడీపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించడంపై దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విధానాలపై పోరుచేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న టీటీడీపీ నేతల యాక్షన్‌ప్లాన్‌పై 10టీవీ కథనం.
పార్టీ బలోపేతానికి కసరత్తు 
2019 సార్వత్రిక ఎన్నికల కోసం టీ టీడీపీ నేతలు పార్టీని సన్నద్ధం చేసే పనిలో పడ్డారు.  క్షేత్ర స్థాయి నుండి పార్టీని బ‌లోపేతం చేసేందుకు  క‌స‌ర‌త్తు  మొద‌లు పెట్టారు.  తెలంగాణా లోని అన్ని నియోజ‌క వ‌ర్గాలకు ఇన్‌చార్జీలను నియమించడంతోపాటు... గ్రామ, మండ‌ల, డివిజ‌న్ స్థాయి ప‌రిశీల‌కుల పేర్లపై సమాలోచనలు జరుపుతోంది. గెలవడానికి అవకాశం ఉన్నచోటల్లా అంకితభావంతో పనిచేసే వారికి చాన్స్‌ ఇవ్వాలని టీ టీడీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. 50 నియోజకవర్గాల్లో చురుకైన యువతకు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 
ఎన్నికల యాక్షన్‌ప్లాన్‌పై అధిష్టానం దృష్టి 
సార్వత్రిక ఎన్నికలకు యాక్షన్‌ప్లాన్‌ను రెడీ చేయడంపై అగ్రనాయకత్వం దృష్టిపెట్టింది.  ఇప్పటి వరకు చేసిన ప్లాన్‌ను, ఎక్సైర్‌సైజ్‌ను  అధినేత చంద్రబాబుకు వివరించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిపిన ప్రజాపోరు యాత్రలు, రైతు గర్జనసభలు, మిర్చి రైతులకు మద్దతుగా చేసిన పోరాటాలను వివరించనున్నారు.  సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితుల సమస్యపై పార్టీ తీసుకున్న లైన్‌, వారిని పరామర్శించిన వివరాలు, డ్రగ్స్‌ మాఫియాకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను అధిష్టానానికి వివరించాలని భావిస్తున్నారు.
టీ. సర్కాన్‌ను ఎదుర్కొనేలా కార్యాచరణ 
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో సమర్థవంతంగా ఎండగట్టేందుకు కూడా టీటీడీపీ కార్యాచరణ రూపొందిస్తోంది.  నకిలీ విత్తనాలు, వర్షాభావ పరిస్థితులు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రుణమాఫీతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలని డిసైడ్‌ అయ్యింది. దళితులపట్ల జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి,అక్రమ ఇసుక వ్యాపారం, మియాపూర్‌ ల్యాండ్‌స్కామ్‌, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, గల్ఫ్‌ బాధితులకు చేయూత అందించడంలాంటి అంశాలపట్ల లోతుగా అధ్యయనం చేసి.. వాటిని ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విధానాలు ఎండగడుతూనే మరోవైపు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. మరి తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న ఉద్యమాలు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి.

Don't Miss