ఈ బంధం కొనసాగేనా?

08:20 - September 8, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్న వైరీ పక్షాలు ఏకమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న సామెత నిజం అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఉప్పు నిప్పులా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయ్. అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు ఏకమవుతున్నాయి. దాదాపు 35 ఏళ్ల పాటు కత్తులు నూరుకున్ను పార్టీలు... తొలిసారి కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితిని ఓడించడమే లక్ష్యంగా ఏకమై ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ స్థాపన 
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో...కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1983 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తో తలపడింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత....తెలుగుదేశం పార్టీ బలహీన పడింది. అటు కాంగ్రెస్‌ పార్టీ సైతం కేసీఆర్ ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పొత్తులకు సిద్ధమవుతున్నాయ్. 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు 
టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఉంటుందంటూ చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.  వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో టీడీపీతో పాటు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తుపై అటు టీడీపీ కూడా సానుకూలంగానే ఉంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నాయుడితో టీటీడీపీ నేతలు చర్చలు జరిపారు. భావస్వారూప్యం ఉన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగుతామంటూ టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... శనివారం టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఇందులో కాంగ్రెస్‌తో పొత్తుపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి టీడీపీ, కాంగ్రెస్‌ మైత్రీ సవ్యంగా కొనసాగుతుందో ? లేదో ? చూడాలి. 

 

 

Don't Miss