2019లో గెలిచి తీరాలి..

21:34 - June 12, 2018

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ సమన్వయ కమిటీ ఆరోపించింది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీ అభివృద్ధికి చారిత్రక అవసరమని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు... ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం..
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఏడాదిలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలతోపాటు జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.

ఆధారాలు లేకుండా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్న టీడీపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు తెలుగుదేశం ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ప్రధానంగా చర్చించారు. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పన్నుతున్న కుట్ర రాజకీయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. ప్రపంచంలో రెండు భిన్నధృవాలైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ శాంతి కోసం సింగపూర్‌లో కలిసిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాంటి సింగపూర్‌ ప్రభుత్వం.. ఏపీని నమ్మి సహకరిస్తుంటే విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. వైపీసీ ప్రయోజనాలు కాపాడేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారంటూ... దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీ నిర్ణయించింది.

సరిగా పనిచేయకపోయినా బహిరంగ విమర్శలు చేస్తున్న నాయకులు
మరోవైపు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించిన చంద్రబాబు.. కొన్ని జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య ముదురుతున్న అంతర్గత కలహాలను ప్రస్తావించారు. పరోక్షంగా కడప టీడీపీ నేతలు వరదరాజులురెడ్డి, సీఎం రమేశ్‌ వ్యవహారాన్ని గుర్తు చేశారు. కొందరు నేతలు సరిగా పనిచేయకపోయినా... బహిరంగ విమర్శలకు దిగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. పనిచేయకపోయినా మారతారన్న ఉద్దేశంతో ఇంతకాలం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అధినేత ఏమీ పట్టించుకోవడం లేదంటూ.. ఏదైనా చేయొచ్చనుకుంటే పొరపాటని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రోజు ఎవరేం చేస్తున్నారో అన్ని నివేదికలు తన వద్ద ఉన్నాయని, తాను తీసుకునే చర్యలకు నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు సమాచారం. నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేబోనని తేల్చిచెప్పారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు మండిపడ్డినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.చంద్రబాబు సూచనలను తెలుగుదేశం నాయకులు ఎంతవరకు వంటపట్టించుకుంటారో, హెచ్చరికలను ఎంతవరకు ఖాతరు చేస్తారో, పద్ధతులు ఎంతవరకు మార్చుకుంటారో చూడాలి. 

Don't Miss