బాబు దీక్షాస్త్రం ఫలించేనా?..

07:28 - April 17, 2018

అమరావతి : హోదా కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి ఉద్యమాలు.. ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ దీక్షను చేసే అవకాశముంది. హస్తినలో చేయబోయే దీక్షే కేంద్రంపై చివరి అస్త్రంగా ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని టీడీపీ సమన్వయ కమిటీలో చంద్రబాబు నిర్ణయించారు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు..
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు హాజరయ్యారు. హోదా సాధించేదిశగా కేంద్రం ఒత్తిడి ఏలా తీసుకురావాలనేదానిపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 20న చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సామూహిక దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పాల్గొనాలన్నారు. 13 జిల్లాల్లో జరిగే జిల్లా స్థాయి దీక్షల్లో 13 మంది మంత్రులు పాల్గొనాలని.. మిగిలిన మంత్రులు చంద్రబాబు దీక్షలో పాల్గొనాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ఈనెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభను వాయిదా వేశారు. వచ్చేనెల పదో తేదీలోగా దాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పదిహేను నుంచి 20 రోజులపాటు అన్ని గ్రామాల్లో టీడీపీ సైకిల్‌ యాత్రలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాదంతా నేతలంతా ప్రజల మధ్యనే ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి చెడ్డపేరు ఎవరు తీసుకొచ్చినా సహించేది లేదన్నారు.
వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ : చంద్రబాబు
టీడీపీ సమన్వయ సమావేశంలో వైసీపీపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ఓ ఫేక్‌ పార్టీ అని.. ఆ పార్టీ రాజకీయమే ఓ ఫేక్‌ అని ధ్వజమెత్తారు. బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అహంభావం ఎంతటివారినైనా పతనంవైపు నడిపిస్తుందని పరోక్షంగా మోదీనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మొన్నటిదాకా బీజేపీకి తిరుగులేదని అనుకున్నారని.. ఇప్పుడు రాజకీయ మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవలేదనే ముద్రపడిందని.. పదవి వినయం పెంచాలేతప్ప అహం పెంచితే ఎవరికైనా పతనం తప్పదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని... ఐదుకోట్ల ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలన్నారు. త్తానికి ఏప్రిల్‌ నెలంతా వివిధ రూపాల్లో కేంద్రానికి నిరసన తెలియజేయాలని చంద్రబాబు సంకల్పించారు. మరి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్‌ను తెలుగు తమ్ముళ్లు ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి.

Don't Miss