నేడు పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

07:33 - July 12, 2018

గుంటూరు : నేడు చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ.. పార్టీపై నేతలు మరింత ఫోకస్‌ పెట్టేలా వ్యూహాలు రూపొందించనున్నారు. నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రణాళికలను ఆయన రచిస్తున్నారు.
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇవాళ చంద్రబాబు తన నివాసంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో చంద్రబాబు పలు అంశాలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈనెల 16వ తేదీ నాటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తవుతున్నందుకు భారీ కార్యక్రమానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రోజు నుంచి సుమారు నాలుగు నెలలపాటు గ్రామదర్శిని పేరుతో నేతలు ప్రజల్లో ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయనున్నారు.  ఈ గ్రామదర్శిని, పట్టణదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు సీఎం చంద్రబాబు నేరుగా ప్రజలతో మమేకంకానున్నారు.  4నెలల కాలంలో 75 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలి, ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ఈ సమావేశంలో చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... అదే సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగినట్టు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఏరోజు నుంచి ప్రారంభిస్తే బావుంటుంది.... ఏయే అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నే అంశాలపై చంద్రబాబు నేతలతో కూలంకశంగా చర్చించనున్నారు. 
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విస్తృత స్థాయి సమావేశం అనంతరం రాత్రికి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్టీ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఏపీకి జరిగిన అన్యాయంపై... కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసిస్తూ ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ భావిస్తోంది.

 

Don't Miss