రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నేతల కుమ్ములాటలు

19:00 - May 19, 2017

కడప : రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకీ బలహీనపడుతోంది. పార్టీలోని సమస్యలు పరిష్కరించుకొని.. వచ్చే ఎన్నికలకు పార్టీని పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పార్టీ నాయకులకు సూచించారు. అయితే రాయచోటిలో మాత్రం పార్టీలోని వర్గ విబేధాలు తారా స్థాయికి వెళ్లేలా కనిపిస్తోంది

రాయచోటి టీడీపీ బాధ్యుడిగా ఉన్న రమేశ్ రెడ్డి

పార్టీ నేతల మధ్య విబేధాలు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ విబేధాలే వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాయచోటి టీడీపీ బాధ్యుడిగా ఉన్న రమేశ్‌ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా తయారైంది.

రమేశ్‌ రెడ్డికి రాయచోటి టీడీపీ బాధ్యతలు

కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన రమేశ్ రెడ్డికి రాయచోటి టీడీపీ బాధ్యతలు అప్పగించారు. రమేశ్‌ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి.. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాన్ని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గుతోందని పాలకొండ్రాయుడు వర్గం భావిస్తోంది. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా.. పెద్దగా ఫలితం లేకపోవడం పాలకొండ్రాయుడిని మరింత నిరాశకు గురి చేసింది. దీంతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టు.. ఆయన వర్గీయులు చెబుతున్నారు.

పాలకొండ్రాయుడితో జగన్‌ మంతనాలు జరిపినట్టు వార్తలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగన్‌.. పాలకొండ్రాయుడితో మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. టీడీపీ నేతలు చొరవ తీసుకొని పాలకొండ్రాయుడిని బుజ్జగించారు. దీంతో కాస్త తగ్గిన పాలకొండ్రాయుడి వర్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్‌ రవికే మద్దతు తెలిపారు. కానీ పార్టీలో మాత్రం తమ ప్రాధాన్యత పెరగలేదన్న అసంతృప్తి పాలకొండ్రాయుడి వర్గంలో ఉంది. పనుల విషయంలో కూడా తమ పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆందోళన ఉంది. వాస్తవంగా పాలకొండ్రాయుడు రాయచోటి నియోజకవర్గంలో మంచి సంబంధాలున్న నేత. సామాజికంగా కూడా పాలకొండ్రాయుడి వర్గానిది గెలుపోటములు శాసించే స్థాయి. పాలకొండ్రాయుడు పార్టీ మారితే టీడీపీ గెలవడం అసాధ్యమన్నది తెలుగు తమ్ముళ్ల మాటగా తెలుస్తోంది.

వైసీపీకి లాభిస్తోన్న టీడీపీ నేతల విబేధాలు

పార్టీ అధినేత మాత్రం కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తోంటే.. నియోజకవర్గాల్లో నేతలు కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీలో ఇదే పరిస్థితి ఉంది. రాయచోటిలో వైసీపీ బలపడటానికి తెలుగుదేశం నేతలే కారణమన్నది పరిశీలకుల వాదన. టీడీపీ నేతల కుమ్ములాటలే.. వైసీపీకి లాభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకోకుండా విస్మరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు రాయచోటిలో అంత సులువు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Don't Miss