జగన్ లేఖ..మండిపడుతున్న ఏపీ టిడిపి...

21:04 - August 11, 2018

విజయవాడ : ఈడీ కేసులో భారతి పేరు ఉందంటూ వచ్చిన వార్తలపై జగన్‌ లేఖ రాయడం మీద.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈడీ కేసులో భారతి పేరుంటే టీడీపీకి సంబంధం ఏంటిని ప్రశ్నిస్తున్నారు. అవినీతిలో కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసిన జగన్‌... ఇప్పుడు పేరు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారన్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాల్సిన జగన్‌.. దీన్ని కూడా సానుభూతి పొందేందుకే యత్నిస్తున్నారన్నారు. ఈడీ కేసులో వైఎస్‌ భారతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్‌ బహిరంగ లేఖ రాయడంపై ఏపీ టీడీపీ నేతలు స్పందించారు. అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మీ భార్య నిందితురాలిగా నమోదైతే దాని ద్వారా కూడా సానుభూతి పొందాలనుకుంటే.. ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదన్నారు. నీ అవినీతికి ఆమెను బాధ్యురాలిని చేసినందుకు నిన్ను నీవే ప్రశ్నించుకోవాలన్నారు. నువ్వు చేసిన పాపాలే నిన్ను, నీ కుటుంబాన్ని వెంటపడి తరుముతున్నాయన్నారు కళా వెంకట్రావు.

ఈడీ కేసులో భారతి పేరు రావడానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కళా వెంకట్రావు. నీ భార్యకు ఈ పరిస్థితి వచ్చినందుకు నిన్ను నువ్వే ప్రశ్నించుకోకుండా.. సీబీఐ, ఈడీనీ, కోర్టులను ప్రశ్నిస్తే లాభమేంటని అన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడిన నీవు... దర్యాప్తు సంస్థలను, వ్యవస్థలను ఎలా ప్రశ్నిస్తున్నావన్నారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడి బెయిల్‌ తెచ్చుకున్నది వాస్తవం కాదా అని కళావెంకట్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రకారం ఏడాదిలో విచారణ పూర్తి కావాల్సిన కేసులు... బీజేపీతో లాలూచీ వల్ల నాలుగేళ్లయినా పూర్తి కాకపోవడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేంద్రం ద్వారా నీ కేసులను మాఫీ చేయించుకునేందుకే... నీ కేసులో ఎ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేయించుకోలేదా ? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తూ లాలూచీ పడడం నీ నైజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు కళా. అక్రమంగా సంపాదించిన 43 వేల కోట్ల రూపాయలు పేదప్రజలకు పంచి.. భారతి కేసుల నుండి విముక్తి చేసేందుకు ప్రయత్నించకుండా అధికారులు, కోర్టులు, పత్రికలు, టీడీపీపై నిందలు వేస్తే సానుభూతి రాదని కళా వెంకట్రావు అన్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ పోరాటం చేస్తుంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారన్నారు మంత్రి దేవినేని. గతంలో కాంగ్రెస్‌తో చేసుకున్న ఒప్పందం వల్లే.. అప్పుడు బయటపడని పాపాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు దేవినేని.

ఇక ఈడీ కేసులో జగన్‌ వాదన విచిత్రంగా ఉందన్నారు మంత్రి యనమల. జగన్‌ లేఖ ద్వారా అవినీతిలో కుటుంబసభ్యులకు ప్రమేయమున్నట్లు స్పష్టమైందన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు టీడీపీకి సంబంధం ఏంటని యనమల ప్రశ్నించారు. మొత్తానికి జగన్‌ అవినీతిపై మరోసారి టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో చూసుకోకుండా టీడీపీ, సీబీఐ, ఈడీ, కోర్టులపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే... జగన్‌పై టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Don't Miss