బలోపేతం దిశగా టీటీడీపీ చర్యలు

07:30 - May 20, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పగ్గాల కోసం టీడీపీ కసరత్తు ప్రారంభించింది. దీనికోసం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా... ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగిలినవారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఖంగుతింది. దీంతో తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొంది.

పార్టీకి పునర్‌ వైభవం...
ఈ నేపథ్యంలో పార్టీకి పునర్‌ వైభవాన్ని తెచ్చేందుకు టీటీడీపీ నాయకులు కృషి చేస్తున్నారు. జిల్లాలలో మినీ మహానాడులను నిర్వహించి... పార్టీపై, రాష్ట్రంలోని సమస్యలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. మండలానికి పది మంది చొప్పున... ఐదు వందల మండలాల్లో... ఐదు వేల మందిని పార్టీలోకి తీసుకోనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి... గ్రామస్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే 24న తెలంగాణ మహానాడును నిర్వహించి... టీడీపీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపనున్నారు. విశాఖలో 27 నుంచి జరిగే టీడీపీ జాతీయ మహానాడులో తెలంగాణ టీడీపీ నుంచి తొమ్మిది తీర్మానాలను ప్రవేశ పెట్టాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. అలాగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై కూడా ఇక్కడ ప్రస్తావించాలని భావిస్తున్నారు. కాగా భవిష్యత్తులో తెలంగాణాలోని కరవు, రైతుల కష్టాలు, విద్య, వైద్యం, కులవృత్తులు వంటి తదితర సమస్యలపై పోరాటాలు చేయాలని టీడీపీ డిసైడ్‌ అయింది.

Don't Miss