2019టార్గెట్ గా టీడీపీ అడుగులు

07:59 - July 17, 2017

గుంటూరు : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అమరావతిలో సచివాలయం నిర్మించినా, పార్టీల కోసం ప్రత్యేక భవనం లేదు. దీంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించాలంటూ ఏదో ఒక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబును కలవాల్సి వస్తే అమరావతిలోని సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సరైన వసతులు లేవు. పైగా ఇది అమరావతికి 35 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు టీడీపీ ఆఫీసులు పార్టీ కార్యక్రమాలను అనువుగా లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక షెల్టర్...
టీడీపీ కార్యాలయం కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థలం కేటాయించారు. కొత్త ఆఫీసు ఇప్పట్లో సిద్ధమయ్యే అవకాశాలు లేవు. దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద భారీ షెడ్‌ నిర్మిస్తున్నారు. చంద్రబాబు సందర్శకులను కలుసుకోవడంతోపాటు టీడీపీ సమావేశాలకు వినియోగించుకునేందుకు వీలుగా దీనిని సిద్ధం చేస్తున్నారు. వీలైంత త్వరగా దీనిని పూర్తి చేయాలని తెలుదేశం అధినాయకత్వం నిర్ణయించింది. చంద్రబాబు సచివాలయం నుంచి రాగానే పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌రావుకు షెడ్‌ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

త్వరలో వైసీపీ కూడా 
మరో వైపు ప్రతిపక్ష వైసీపీ కూడా త్వరలో అమరావతి నుంచి కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. పార్టీ అధినేత జగన్‌ అమరావతి నుంచి రాజకీయ వ్యూహ రచన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండు నుంచి అమరావతికి మకాం మార్చేందుకు తాడేపల్లిలో నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ అమరావతి కేంద్రంగా రాజకీయాలను వేడెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

Don't Miss