పులివెందులకు కృష్ణా నీరివ్వడానికి కారణమదే..

06:52 - January 9, 2017

కడప : జిల్లాలో నీళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్‌కు పెట్టనికోట అయిన కడపలో పాగా వేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పులివెందులకు కృష్ణానీళ్లు తరలిచ్చేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈనెల 11న ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు.

వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట....

కడప జిల్లా పులివెందుల. ఇది వైసీపీకి శత్రుదుర్బేద్యమైన కోట. అలాంటి కోటలో అడుగుపెట్టేందుకు టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నీటి సమస్యను అస్త్రంగా వాడుకుంటోంది. జిల్లాలో నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టులు అరకొరగా ఉన్న నేపథ్యంలో గాలేరు-నగరి ప్రాజెక్టులో అంతర్భాగమైన గండికోట రిజర్వాయర్‌ పెండింగ్‌ పనులను టీడీపీ పూర్తి చేసింది. దీంతోపాటు పులివెందులలోని పైడిపాలెం రిజర్వాయర్‌ పనులను కూడా పూర్తయ్యాయి. వీటిద్వారా నీళ్లు అందిస్తే సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా.. పులివెందులలో తాము పాగా వేసేందుకు అవకాశం దక్కుతుందనే లక్ష్యంతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.

వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ ...

పులివెందులలో మొదటినుంచి వైఎస్‌ కుటుంబాన్ని టీడీపీ నేత సతీష్‌రెడ్డి ఢీ కొడుతున్నారు. ఎలాగైనా పులివెందుల ప్రజల మనసుల్లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నారు. అందుకోసం ఎలాగైన పులివెందులకు కృష్ణా నీళ్లు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పులివెందులకు నీళ్లు తరలించే వరకు తన గడ్డం, మీసాలు తీయనని 2015లో ప్రతిజ్ఞ పూనారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రాజెక్టుల పనులపై దృష్టి సారించి పూర్తి చేయించారు. తాజాగా గంటికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈనెలలో సీఎం చంద్రబాబు గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయనున్నారు.

టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్న వైసీపీ...

అయితే.. వైసీపీ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. గాలేరు-నగరి, గండికోట రిజర్వాయర్‌ పనులన్నీ వైఎస్‌ హయాంలోనే పూర్తయ్యాయని.. కేవలం 10 శాతం పనులు పూర్తి చేసిన టీడీపీ ఇది తమ ఘనతగా చెప్పుకుంటుందని విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండే.. గండికోట రిజర్వాయర్‌లో దాని కెపాసిటీ మేర నీటి నిల్వ ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే..

గండికోట నుంచి పైడిపాలెం రిజర్వాయర్‌కు నీళ్లు వస్తే.. పులివెందుల బాగుపడడం అటుంచితే.. సతీష్‌రెడ్డికి గడ్డం, మీసాల బాధ తీరుతుందని జిల్లావాసులు సరదాగా చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా పులివెందులకు నీళ్లు ఇచ్చి బలం పెంచుకోవాలని టీడీపీ చూస్తుండగా.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ నేతలంటున్నారు. అయితే.. ప్రజలకు ప్రభుత్వం ఏ మేరకు నీళ్లుస్తుంది ? అవి ఎంతమేరకు ఉపయోగపడతాయో దాన్ని బట్టి అధికార పార్టీ వ్యూహం సఫలమా ? విఫలమా ? తేలుతుందని విశ్లేషకులంటున్నారు.

Don't Miss