ప్రజల్లోకి వెళ్లనున్న టీజేఏసీ...

06:53 - March 20, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమరశంకం పూరిస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ..తాడోపేడో తేల్చుకునేందుకు దండయాత్రకు సిద్ధమవుతోంది. నిరుద్యోగ ర్యాలీ సందర్బంగా ప్రభుత్వం అనుసరించిన తీరుతో...గ్రామ స్థాయి నుంచి జనంలోకి వెళ్లేందుకు టీ-జాక్ ప్రణాళికలను రచిస్తోంది. తెలంగాణా ఉద్యమట్యాగ్ లైన్‌గా ఉన్న నీళ్లు-నిధులు-నియామాకల అంశాలనే అస్త్రాలుగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై తెలంగాణ జేఏసీ మరింత దూకుడును పెంచింది. తెలంగాణా ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిన టీ-జాక్..తమ కార్యాచరణను మరింత విస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రభుత్వం విఫలమవుతున్న అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచాలని జాక్ నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతున్న టీజాక్‌కు..ప్రభుత్వం తరపున కూడా అదే స్థాయిలో అడ్డంకులు ఎదురౌతున్నాయి. ప్రభుత్వ తీరును తప్పుబడుతూనే ప్రజా సమస్యలపై దృష్టి పెడుతామని స్పష్టం చేస్తోంది. ఆదివారం జరిగిన టీజాక్ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను జాక్ తీసుకుంది.

పాదయాత్ర..
కార్పొరేట్ విద్యావ్యవస్థకు మద్దతు తెలిపేలా ప్రభుత్వ విధానం ఉందని తెలంగాణ జేఏసీ అభిప్రాయ పడింది. ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయకపోవడంపై ఏప్రిల్ నుంచి జిల్లాల్లో సదస్సులు నిర్వహించడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మే నెలలో "నీళ్లు-నిధులు-నియామకాలు'' నిజాలు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అంటున్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ స్పూర్తి యాత్రను జూన్‌ 21 నుంచి మొదలు పెట్టాలని సమావేశం నిర్ణయించినట్లు కోదండరామ్‌ తెలిపారు. ఓ వైపు నిరసన కార్యక్రమాలను చేపడుతూనే..గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకాన్ని చేపట్టాలని టీ-జేఏసీ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు టీ జేఏసీ సిద్ధమవుతోంది. అయితే టీ జేఏసీ తీరుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Don't Miss