యాదాద్రిలో టీ మాస్, బీఎల్ఎఫ్ పర్యటన

21:41 - February 2, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరులో దాడికి గురైన దళితులకు టీమాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ అండగా నిలిచింది. దళితులపై దాడి జరిగి నెలరోజులవుతున్నా... ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన బాటపట్టింది. వెంటనే బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు. ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి టీ-మాస్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు ర్యాలీగా కందుకూరుకు బయల్దేరారు. అనంతరం బాధిత దళితులకు అండగా... గ్రామంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టీ-మాస్‌ చైర్మన్‌ కంచ ఐలయ్య, కన్వీనర్‌ జాన్‌వెస్లీ, బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, టీమాస్‌ నేతలు పాల్గొన్నారు.

దళితులు, మైనారిటీలపై దాడులు 
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు ఎక్కవయ్యాయన్నారు తమ్మినేని. తెలంగాణలోనూ కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు జరుగుతున్నాయన్నారు. అయితే... ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. దళితులకు అండగా నిలిచి మనోదైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తమను అడ్డుకునేందుకు ప్రయత్నించారని... పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు తమ్మినేని. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు కంచ ఐలయ్య. బాధ్యులను అరెస్ట్‌ చేసే వరకు దళితులకు అండగా నిలబడతామన్నారు. మరోవైపు బాధ్యులను అరెస్ట్‌ చేయని పోలీసులు.. బాధితులను బెదిరిస్తూ కేసులు పెడుతున్నారన్నారు నల్లా సూర్యప్రకాశ్‌. ఇకపై ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదన్నారు. సభకు హాజరైన టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలంతా దళితవాడలో పర్యటించి.. దళితులతో కలిస సహపంక్తి బోజనాలు చేశారు. టీ-మాస్‌, బీఎల్‌ఎఫ్‌ నేతలు అండగా నిలబడడంతో.. తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం బాధిత దళితుల్లో వ్యక్తమవుతోంది. 

Don't Miss