హింసాత్మక బెంగాల్..

21:41 - May 14, 2018

పశ్చిమ బెంగాల్‌ : జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మృతి చెందారు. టిఎంసి కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఇద్దరు సిపిఎం కార్యకర్తలను సజీవ దహనం చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న తృణమూల్‌ చర్యలను తీవ్రంగా ఖండించింది.

పంచాయితీ ఎన్నికల్లో హింస
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లింది. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

ఇంట్లోనే సజీవ దహనమైన దేబుదాస్‌, ఉషాదాస్‌ దంపతులు
సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లాలో.. సీపీఎం మద్దతుదారుల ఇల్లును గత రాత్రి తృణమూల్‌ గూండాలు తగలబెట్టారు. సీపీఎం కార్యకర్తలైన దేబుదాస్‌, ఉషాదాస్‌ అనే భార్యాభర్తలపై దాడి చేసి ఇంట్లోనే సజీవ దహనం చేశారు. ఈ ఘటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని సిపిఎం విమర్శించింది. తృణమూల్‌ చర్యలను ఖండించింది. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ వరకు హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించింది.నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో బిజెపి, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బాగ్డాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలోకి కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి బాలెట్‌ పత్రాలపై స్టాంపులు వేయడానికి ప్రయత్నించారు. జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బాంబు పేలడంతో 20 మంది గాయపడ్డారు. కూచ్‌ బిహార్‌లో బిజెపి కార్యకర్తపై ఓ మంత్రి చేయి చేసుకున్నాడు. శికర్‌పూర్‌ గ్రామంలో బ్యాలెట్‌ బాక్స్‌ను తగుల బెట్టారు.

మీడియా వాహనాన్ని ధ్వంసం
భాంగర్‌ జిల్లాలో ఓ మీడియా వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. టిఎంసి కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించేందుకు యత్నించారు. కొన్ని చోట్ల ప్రజలను ఓటు వేయకుండా వారు అడ్డుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు
గత నెల 2న పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ మొదలైన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నామినేషన్‌ వేయకుండా అధికార టీఎంసీ ఇతర పార్టీల అభ్యర్థులను అడ్డుకుంటుందని విపక్షాలు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 58, 639 గ్రామపంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సుమారు 20వేల స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయింది. 

బెంగాల్ హింసపై వ్యతిరేకంగా సీపీఎం నిరసనలు..
పశ్చిమ బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌ దాడులను ఏపీ సీపీఎం తీవ్రంగా ఖండించింది. దాడులను నిరసిస్తూ విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని అన్సారీ పార్క్‌ సెంటర్‌లో పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వైవీ హాజరయ్యారు. బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస అక్కడ పాలనా విధానాలను బయట పెట్టిందని మధు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు.. బెంగాల్లో మాత్రం ప్రభుత్వ నిర్భందపూరిత వాతావరణంలో జరిగాయన్నారు. టీఎంసీ అప్రజాస్వామికంగా వ్యవహిరించిందని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ కలగజేసుకుని తిరిగి పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బెంగాల్‌ దౌర్జన్యఖాండను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మధు తెలిపారు. 

Don't Miss