టీఎంయూ Vs టీఆర్‌ఎస్‌...

06:42 - May 10, 2018

హైదరాబాద్ : అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికవర్గాల్లో క్రమంగా పట్టు కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమైంది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇవ్వడం ద్వారా టీఆర్‌ఎస్‌, టీఎంయూ మధ్య అంతరం పెరిగినట్టు భావిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయంగా పట్టు సాధించిన టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. బలమైన కార్మికోద్యమంలో పట్టు సాధించి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంది. RTC లాంటి పెద్ద సంస్థల్లో కూడా సత్తా చాటింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమంగా ఆ పట్టు కోల్పోతున్న సంకేతాలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఏర్పాటైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌కు అనుంబంధ కార్మిక సంఘంగా అవతరించింది. ఇప్పుడు టీఎంయూ, టీఆర్‌ఎస్‌ మధ్య అంతరం పెరుగుతోంది. ఉద్యమ సమయంలో గులాబీ దళపతికి అండగా నిలిచిన ఈ సంఘం... ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తోంది. కార్మిక శ్రేయస్సు కోసం తాము పోరాటం చేస్తామని టీఎంయూ ప్రకటించడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి హరీశ్‌రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్న టీఎంయూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

RTC కార్మికుల డిమాండ్ల సాధనకోసం ఇటీవల నిర్వహించిన బస్ భవన్ ముట్టడి సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా.....ఆ ఫలాలు కార్మికులకు అందలేదన్నది టీఎంయూ నేతలు ఆరోపణ. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధార పడడంలేదని....మీ అవసరం మాకు ఎంతో... మా అవసరం కూడా మీకు అంతే ఉంటుందని టీఎంయూ నేతలు వ్యాఖ్యానించడం ఆలోచించిదగ్గ పరిణామంగా భావిస్తున్నారు. ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా....ఉద్యమకారుల సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ విషయంలో TMU నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేనికి సంకేతమో అన్న అనుమానాలు వ్యక్తవుతున్నాయి.

మంత్రి హరీశ్‌రావుకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతుందన్న ప్రచారం ఊపందుకోవడం.... అదే సమయంలో మరో ఉద్యమ నేత కోదండరామ్ టీజేఎస్‌ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ... ప్రభుత్వంపై తిరుగుబాటుకు పావులు కదపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వానికి పూర్తి స్థాయి అండదండలు అందించిన కార్మిక సంఘం ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచడం రాజకీయంగా టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. 

Don't Miss