టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అక్రమాలు...

06:45 - June 11, 2018

సిరిసిల్ల : ఆయనో ప్రజాప్రతినిధి. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించాల్సిన నేత. ప్రజల కష్టాలు అలా ఉంచితే.. ఆయనే పెద్ద సమస్యగా మారాడు. అధికారమే అండగా పేదలకు చెందిన భూములను కబ్జా చేసేస్తున్నాడు. ఇదేంటని నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అక్రమాలపై స్పెషల్‌ స్టోరీ.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. పేదల భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. బీవై నగర్‌లో బీద మహిళకు చెందిన స్థలాన్ని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, సిరిసిల్ల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కబ్జా చేసినట్టు ఆరోణలు వినిపిస్తున్నాయి.

బీవై నగర్‌లో సువర్ణ అనే మహిళ నివాసముంటోంది. తల్లి నుంచి సంక్రమించిన స్థలంలో పూరిగుడిసె వేసుకుని.... భర్త, కొడుకుతో బీడీలు చుట్టుకుంటూ బ్రతుకుతోంది. అనుకోకుండా ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. కొడుకు కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కొడుకును బ్రతికించుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గత వర్షాకాలంలో పూరిగుడిసె కూడా కూలిపోవడంతో.... సిరిసిల్లలోనే మరోచోట ఓ చిన్నరూమ్‌ తీసుకుని ఉంటోంది.

బీవై నగర్‌లోని సువర్ణకు చెందిన స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. మంత్రితోపాటు అధికారుల అండదండలు ఉన్న స్థానిక టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అయిన తవుటు కనకయ్య ఆ భూమిని కబ్జా చేసేశాడు. దొంగ పత్రాలు సృష్టించి ఓ నిరుపేద మహిళను రోడ్డున పడేశాడు. తన స్థలంలోకి వెళ్తామని వచ్చిన ఆ మహిళను కౌన్సిలర్‌ అనుచరులు అడ్డుకున్నారు. ఆ స్థలం తనదేనని చెప్పినా వినిపించుకోకుండా ఆమెను గెంటి వేశారు. దొంగపత్రాలు చూపించి తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆ మహిళ ఆరోపిస్తోంది. కౌన్సిలర్‌నే నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ప్రజలకు సేవ చేయాల్సిన నేతలే వారి స్థలాలను కబ్జా చేస్తుండడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు స్పందించి పేద మహిళకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తనకు న్యాయం చేయకుంటే కలెక్టరేట్‌ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు హెచ్చరిస్తోంది.

Don't Miss