రిజర్వేషన్లకు సిద్ధం : టీ.సర్కార్‌

07:03 - January 12, 2017

హైదరాబాద్ : ఎన్నికల హామీని నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముస్లింలు, గిరిజనులకు 12శాతం  రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామంటున్నారు. పండుగ తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు సిద్ధమవుతున్నారు. 
రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం 
ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు  టీఆర్‌ఎస్ సర్కార్‌ డిసైడ్‌ అయ్యింది. ముస్లింలు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల అంశంపై  ఈ శీతాకాల సమావేశాల్లోనే  తీర్మానం చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
టీసర్కార్‌ ప్రయత్నానికి అడ్డంకిగా ఉన్న సుప్రీం తీర్పు 
అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న సుప్రీంకోర్డు తీర్పు  సర్కారు ప్రయత్నానికి   అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అందుకే  చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. రిజర్వేషన్లను పెంచే విధానంపై తెలంగాణ సీఎం అధికారులతో చర్చించారు.  తమిళనాడులో ఇప్పటికే 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్నందున అక్కడి విధానాన్ని అనుసరించి వ్యూహాన్ని రూపొందిస్తామంటున్నారు కేసీఆర్‌.
జనాభాను అనుసరించి రిజర్వేషన్ల డిమాండ్‌
తెలంగాణలో ఎస్టీలతో పాటు ముస్లీం జనాభా  అధికం సంఖ్యలో  ఉంది. అందుకే జనాభా నిష్పత్తిని అనుసరించి  రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్‌తో అసెంబ్లీలో తీర్మానం చేసి..పార్లమెంటుకు పంపాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయించింది.  తెలంగాణలో ముస్లీంలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీర్‌ సర్కార్‌ నిర్ణయించింది. దీని సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. 

 

Don't Miss