కేసీఆర్ వరాలు..అధికారంలోకి రావడానికేనా ?

06:36 - May 10, 2018

మెదక్ : ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నదాతలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రైతుబంధు పథకం కింది పెట్టుబడి సాయం అందిస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు నీటి తీరువా బకాయిలు రద్దు చేశారు. భవిష్యత్‌లో అన్నదాతల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని మెదక్‌ సభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 నుంచి 8 వందలకోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌.. ఇకపై తెలంగాణలో నీటితీరువా వసూళ్లు ఉండవన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు.

వచ్చే నెల 2 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేయనున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ల్యాండ్‌ మ్యుటేషన్‌ కోసం ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాస్‌ బుక్‌లు కొరియర్‌ ద్వారా ఇంటికి పంపించే ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ చెప్పారు.

మరోవైపు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ మరోసారి చెప్పారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా... ప్రజలకు తాగడానికి నీరులేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజల వెనుకబాటుకు కాంగ్రెస్‌ ,బీజేపీలే కారణమని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ కేంద్రంగా కొత్త బస్సు డిపో మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి మెదక్‌ జిల్లాలో ఇంటింటికి నల్లా నీరు అందిస్తామని చెప్పారు. మెదక్‌ సభలకు రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు భారీగా తరలివచ్చారు. 

Don't Miss