రైతు సమితిల కోసం జోరుగా ఫైరవీలు

08:13 - September 14, 2017

మహబూబ్ నగర్ : ల్లాలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హోరాహోరీగా జరుగుతుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా జరుగుతున్న రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ పదవికి పోటీ నెలకొంది. భవిష్యత్ ఎన్నికల సందర్భంగా ఈ పదవి నియామకంపై పలు రకాల సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. తమ అనుచరులకు పదవి దక్కించుకోవడం ద్వారా నియోజకవర్గాల్లో పట్టు బిగించాలని ఎమ్మెల్యేలు ఆశిస్తుంటే ..ఈ సారైనా తమకు ఛాన్స్ ఇవ్వకపోతారా..అన్న ధీమాలో అని సీనియర్లు ఉన్నారు. నియోజకవర్గాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పదవి దక్కితే ఆయా వర్గాలకు దగ్గరవ్వాలనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధేయత, సామాజిక వర్గాల ప్రాధాన్యం ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమనే అంశాల ఆధారంగా కోఆర్డినేటర్‌ నియామకం ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాల నుండి సంకేతాలు వస్తున్నాయి.

అధ్యక్ష పదవి రేసులో
అధ్యక్ష పదవి రేసులో జిల్లా మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస గౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ రాజేందర్‌ రెడ్డి, సి రామ్మోహన్‌ రెడ్డిలు ఉన్నారు. ఇక కోఆర్డినేటర్ పదవి కోసం.. గతంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా పని చేసిన వారు మొదలుకొని రెండో స్థాయి నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మఖ్తల్ నియోజకవర్గం నుండి గతంలో నియోజకవర్గ ఇంచార్జ్‌గా పనిచేసిన దేవర మల్లప్ప, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుండి బోయిన్‌ పల్లి శ్యాంసుందర్‌ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం నుండి బస్వరాజ్‌, మఖ్తల్‌ నుండి మాజీ ఎంపీపీ వెంకట్రామి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

బలమైన అభ్యర్ధులకు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాలను కంచుకోటలుగా తీర్చిదిద్దుకునేందుకు తమ పరిధిలో బలమైన అభ్యర్ధులకు పదవిని ఇప్పించుకోవాలనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వ్యూహాలు ఇలా ఉంటే గతంలో పార్టీ కోసం ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన వారికి ఈ సారైనా అవకాశం ఇస్తారనే నమ్మకంతో సీనియర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో రైతు సమన్వయ సమితి పదవికి పోటీ నెలకొన్నందున అభ్యర్ధి ఎంపికపై ఆలోచించాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఓవైపు జోగుళాంబ గద్వాల్ జిల్లా...గ్రామాల్లో సమన్వయ కమిటీల గొడవ నడుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎంపిక ప్రక్రియ ముగిసినా అలంపూర్‌లో మాత్రం అడుగు ముందుకు పడలేదు. నాయకుల మధ్య వున్న విభేదాల వల్ల ఒక్క కమిటీ కూడా పూర్తి కాలేదు. తమ వారికే అవకాశం ఇవ్వాలని నేతలు పోటీ పడుతుండడంతో కమిటీల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెండు రోజుల్లో కమిటీ ఎంపిక పూర్తి చేస్తామని మాజీ ఎంపి జగన్నాథం చెబుతున్నారు. అధ్యక్ష పదవికి సీతారాం రెడ్డి, గట్టు తిమ్మప్ప, టీఆర్‌ఎస్‌ పార్టీ గద్వాల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కృష్ణ మోహన్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ తల్లి బండారి దేవమ్మ పోటీలో నిలిచే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జోగులాంబ గద్వాలలో కోఆర్డినేటర్‌ పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త
నాగర్‌ కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజక వర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా రైతు సమన్వయ కమిటీలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే మఖ్తల్‌ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కి కమిటీలో తనను ఎంపిక చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేసినా స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తనకు సరైన గుర్తింపు ఇవ్వడంలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇలా రైతు సమన్వయ సమితి కమిటీ ఎంపిక ప్రభావం పార్టీపై తీవ్రంగా వుంది. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు ఓవైపు... ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శలు మరోవైపు... దీంతో అధికార పార్టీ నేతలకు ఇదో పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీకి అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Don't Miss