'కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వాలి'

07:27 - August 11, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ జితేందర్‌ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ కే.కేశవరావు నాయకత్వాన పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 3 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ ఆశిస్తోన్న కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్‌ పోలో, జింఖానా మైదానం, రక్షణ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలిపారు. కేంద్రం ఇచ్చే భూములకు ఎక్స్‌చేంజ్‌గా ఇవ్వాల్సిన భూములపై కూడా ప్రధానికి వివరించామన్నారు. 
భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎంపీలు
కేంద్రం ఇచ్చే భూములకు బదులుగా ఇవ్వాల్సిన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి వివరించామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. రోడ్ల విస్తరణకు ఇవ్వాల్సిన భూముల వలన తాము నష్టపోయే 31 కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఇవ్వాలని రక్షణ శాఖ కోరిందని మోదీకి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం అడిగిన వెంటనే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన రక్షణ శాఖ తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించడంలో ఆసల్యం చేస్తోందన్నారు. రాష్ట్ర సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని ప్రధానిని కోరినట్లు టీఆర్ఎస్‌ ఎంపీలు తెలిపారు. ఈ సమస్యలపై ప్రధాని సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

Don't Miss