టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్

07:08 - October 13, 2017

 

నల్లగొండ : 2019లో జరిగే సాధారణ ఎన్నికలకు కొత్త జోష్‌తో వెళ్లాలని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే గుత్తా ఎంపీ పదవి రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గుత్తా చేరితో నల్లగొండలో కాంగ్రెస్‌ ఆధిపత్యానికి గండికొట్టాలని కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతలు ఉండడంతో ఆ జిల్లానే గులాబీ దళపతి టార్గెట్‌ చేశారు. నల్లగొండ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి... సాధారణ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడమే కేసీఆర్‌ టార్గెట్‌.

గులాబీబాస్‌ వ్యూహాలు.....
నల్లగొండ ఎంపీ స్థానానికి గుత్తా రాజీనామాపై స్పష్టత వచ్చిన వెంటనే ఇతర పార్టీ నేతలను కారెక్కించుకునేందుకు గులాబీబాస్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కేసీఆర్‌ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పునాదులపై దెబ్బకొట్టడమే కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే సెకండరీ నాయకత్వంపై దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారినందరినీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు గండికొట్టవచ్చని టీఆర్‌ఎస్‌ సారథి వ్యూహం.

దామోదర రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డితో
నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కాంగ్రెస్‌కు బలమైన నేతలు దామోదర రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డితో టీఆర్ఎస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దామోదర మాత్రం టీఆర్‌ఎస్‌కు కొన్ని డిమాండ్స్‌ వినిపిస్తున్నట్టు సమాచారం. తన వర్గానికి చెందిన కొంతమందికి ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలనేది దామోదర వినిపిస్తోన్న డిమాండ్‌. ఇక మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌తోనూ టీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు కూడా అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి బలమైన నేతలను కారు ఎక్కించుకునేందుకు గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు.

Don't Miss