'నాలుగేళ్లు గడిచాయి..ఎక్కడ అభివృద్ధి'...

18:27 - February 10, 2018

పశ్చిమగోదావరి : తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ రాష్టాలు విడిపోయి నాలుగేళ్లు గడిచిపోయాయన..ఎక్కడ అభివృద్ధి అంటూ తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. భీమవరంలో సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోతే అభివృద్ధి అవుతుందని ఆనాడు చెప్పారని, నీళ్లు..నిధులు..నియామకాలు వస్తాయని ఆనాడు ఉద్యమం చేసిన కేసీఆర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రజలు నమ్మి ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయారని, అనంతరం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ నాలుగేళ్లు గడిచిపోయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని, ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారని..ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు.

ఏపీ, తెలంగాణలో కొత్త సీఎంలు వచ్చారని..ఇరు రాష్ట్రాల్లో పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు. కానీ ప్రజల బాధలు..కష్టాలు తీరలేదని..హక్కులు..సమస్యల కోసం ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో 7.5 శాతం అభివృద్ధిలో ఉన్నామని మోడీ..తెలంగాణలో పది శాతం వృద్ధి సాధించామని కేసీఆర్ పేర్కొంటున్నారని తెలిపారు. పెరిగిన జీడీపీలో 73 శాతం సంపద ధనికుల..కుబేరుల చేతుల్లోకి వెళుతోందని..ఇదే నా అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజలు అభివృద్ధి అయితేనే రాష్ట్రం..దేశం అభివృద్ధి చెందుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ఎర్రజెండాను అధికారంలోకి తీసుకరావాలని..అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని తాము చెప్పడం జరుగుతోందని...ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల ముందట పెట్టాలని సూచించారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ ఏర్పాటయ్యిందని, ఆనాటి చరిత్రను పునరావృతం చేస్తామని..ఎర్రజెండా రాజ్యాధికారం కోసం పోరాడుతామన్నారు. సకల అట్టడుగుల మీద అగ్రకులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని..అగ్రకులాల ఆధిపత్యం అణగదొక్కడానికి పోరాటం చేస్తున్నట్లు..ఇందుకు 28 పార్టీలతో బిఎల్ఎఫ్ ఏర్పాటైందన్నారు. అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తామో బిఎల్ఎఫ్ స్పష్టంగా ప్రజలకు చెబుతోందన్నారు. 

Don't Miss