నూతన ఎక్సైజ్ పాలసీ

21:25 - September 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేసింది. రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో 6 శ్లాబ్‌ల నుంచి 4 శ్లాబ్‌లకు తగ్గించారు. అప్లికేషన్ ఫీజును 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. హైదరాబాద్‌లో వైన్‌ షాపులను రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించారు.  
రేపటి నుంచి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ 
తెలంగాణ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలసీని ఖరారు చేసింది. మద్యం షాపులకు దరఖాస్తులను బుధవారం నుంచి ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. అలాగే.. గతంలో ఉన్న 6 స్లాబులను 4కు తగ్గించారు. మద్యం దుకాణానికి దరఖాస్తు ఫీజును 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. ఒక వ్యక్తి ఒకే మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అనుమతిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాన్ని మరో గంట పొడిగించారు. రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. షాపింగ్ మాల్స్‌లో కూడా మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 50 వేల జనాభా ఉన్న చోట మద్యం దుకాణానికి వార్షిక ఫీజు రూ. 45 లక్షలు. ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు వార్షిక ఫీజు రూ. 55 లక్షలుగా... ఇరవై లక్షల వరకు జనాభా ఉన్నచోట వార్షిక ఫీజు రూ. 85 లక్షలుగా.... 20 లక్షలు పైబడి జనాభా ఉన్న చోట దుకాణానికి వార్షిక ఫీజు 1 కోటీ 10 లక్షలుగా నిర్ణయించారు.  ఏడాదికి లైసెన్స్ రుసుం కింద 1360 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.
కొత్త మద్యం విధానం రెండేళ్లపాటు అమలు
దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పులేదన్న సోమేశ్‌ కుమార్‌... హైదరాబాద్‌లో గతంలో మిగిలిన 72 దుకాణాలను డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రతి మద్యం దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని అబ్కారీ శాఖ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుందని చెప్పారు. కొత్త మద్యం విధానం రెండేళ్లపాటు అమల్లో ఉండనుంది.

 

Don't Miss