నత్తనడకన 'మిషన్ భగీరథ'

12:38 - September 8, 2017

కామారెడ్డి : ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో పనులు ప్రారంభమైనా.. గడువులోగా పథకాన్ని పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అటు నేతలు.. ఇటు అధికారుల తీరుతో పథకంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. 
పనులు పూర్తి చేయటంలో అధికారులు విఫలం 
మిషన్‌ భగీరథ పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు అనుకున్న సమయానికి ఈ పథకం పూర్తవుతుందా లేదా అని అయోమయంలో పడ్డారు. ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందించే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో గతేడాది పనులు ప్రారంభమయ్యాయి. కానీ గడువులోగా పనులు పూర్తి చేయటంలో అధికారులు రెండుసార్లు విఫలమయ్యారు. 
పనులలో జాప్యం
పనులలో జాప్యంతో మూడోసారి కూడా మిషన్‌ భగీరథ పనులు.. గడువులోగా పూర్తయ్యేలా కనిపించటం లేదు. సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశాలున్నా .. 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ నెలాఖరులోగా ఎలా పూర్తి చేస్తారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్‌ చివరి నాటికి అన్ని గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. 309 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. బాన్సువాడ డివిజన్‌ పరిధిలో 12 మండలాల్లో, 525 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పనులు చేపట్టారు. ఇలా అనేక చోట్ల పథకం ప్రారంభమైంది కానీ పనులు ముందుకు సాగడం లేదు. 
మొదటి విడతలో 131 ప్రాంతాలకు నీరు 
మొదటి విడత కింద కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని.. 131 నివాస ప్రాంతాలలో నీరందించాల్సి ఉంది. ఇప్పటికే ప్రధాన పైపులైన్‌ వేయటం పూర్తి కాగానే గ్రామాలలో అంతర్గత పైపులైన్‌ 244 కిలోమీటర్లకు గాను.. 230 కిలోమీటర్ల పైపులైన్‌ వేశారు. 50 వాటర్‌ ట్యాంకుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. 22, 310 కుళాయిలకు 15, 202 కుళాయిలను బిగించారు. మోటార్ల బిగింపు ఇతరేతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా పనులన్నీ సగంలో ఉండటంతో ప్రజలు ఈ సారైనా ఈ పథకం పూర్తవుతుందా లేదా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. 

 

Don't Miss