సిరిసిల్ల చేనేత పరిశ్రమకు కొత్త కళ

11:51 - August 24, 2017

సిరిసిల్ల : ఒకప్పుడు ఆత్మహత్య ఖిల్లాగా పేరు పొందిన సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని లభిస్తోంది. నేత వస్త్రాలు ఆదరణకు నోచుకోకపోవడంతో పొట్టగడవక పస్తులున్న చేనేత కార్మికుల నోట్లోకి ఇప్పుడు నాలుగువేళ్లు వెళ్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సిరిసిల్ల చేనేత కార్మికలు జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సిరిసిల్ల నేతన్నలకు బతుకునిస్తున్న బతుకమ్మ చీరల తయారీపై 10 టీవీ ప్రత్యేక కథనం.. 
సిరిసిల్ల చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి
సిరిసిల్ల చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఒకప్పుడు సిరుల ఖిల్లా. ఆ తర్వాత చేనేత వస్త్రాలకు ఆదరణ కరవు అవ్వడంతో  ఆత్మహత్యల ఖిల్లాగా మారింది. నేత వస్త్రాల తయారీ కోసం చేసిన అప్పులు తీరక చాలా మంది  చేనేత కార్మికులు  తనవుచాలించారు. వీరి బతుకులు ఛిద్రమైపోయాయి. ఈ సంక్షోభానికి తరుణోపాయం లేకపోవడంతో నేతన్నలు చాలా కాలం అష్టకష్టాలు పడ్డారు. కానీ  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బతుకమ్మ చీరల కార్యక్రమం  సిరిసిల్ల చేనేత కార్మికులను పస్తులు, ఆత్మహత్యల దుస్థితి నుంచి గట్టెక్కించింది. 
తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ 
తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగ. వచ్చే నెలలో జరిగే ఈ పండుగకు ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ చీరల తయారీకి అన్ని చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చింది. దీంతో రకరకాల డిజైన్లతో రంగు రంగుల చీరలు రూపుదిద్దుకుంటున్నాయి. దాదాపు 40 వేల మగ్గాలకు పని లభిస్తోంది. ముప్పైవేల మంది కార్మికులకు ఉపాధి  దొరుకుతోంది. మూడున్నర కోట్ల రూపాయల వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయిచింది. బతుకమ్మ పండుగ కోసం 80 లక్షల చీరలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ బతుకుల్లో  మళ్లీ వెలుగులు నిండుతున్నాయని నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
బతుకమ్మ చీరలతో మీ.2.25 రూ. 
గతంలో రోజులో 12 గంటలు కష్టపడ్డా మీటరు వస్త్రం తయారీకి డెబ్బై పైసలు కూడా లభించేదికాదు. బతుకమ్మ చీరలతో ఇప్పుడు మీటరుకు 2.25 రూపాయలు లభిస్తోంది. గతంలో వారం రోజులు కష్టపడితే 15 వందల రూపాయలు వచ్చేవి. ఇప్పుడు నాలుగు వేల రూపాయలు లభిస్తోంది. 
చేనేత వస్త్రాల కొనుగోలుకు శాశ్వత చర్యలు 
ఒక బతుకమ్మకే కాకుండా ఎప్పుడూ ఇలాగే చీరలు పంచే విధంగా చర్యలు తీసుకుకోవడంతోపాటు, చేనేత వస్త్రాల కొనుగోలుకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బతుకమ్మ చీరలే కాదు... రాజీవ్‌ విద్యా మిషన్‌ కింద కూడా కోటి ఇరవై లక్షల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్ల నేత కార్మికల నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో కార్మిక ఉపాధికా ఢోకా ఉండదని భావిస్తున్నారు. 

 

Don't Miss