'పార్థివ వాహనం'..

06:40 - November 19, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించి.. స్వస్థలాలకు పార్థివదేహాలను తరలించేందుకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆస్పత్రులలో మరణించిన వారిని ఇళ్లకు తరలించేందుకు 'పార్థివ వాహనం' పేరిట ఉచిత వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్న పేదలకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న తమ ప్రభుత్వం.. పేదలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పతులలో సిబ్బంది సేవాభావంతో పని చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌. పేదల పార్థివ దేహాలను తరలించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తొలి విడతలో 50 పార్థివ వాహన సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ వాహన సర్వీసులను కల్పిస్తామని మంత్రులు తెలిపారు.

Don't Miss