డీఎస్సీకి రంగం సిద్దం

07:10 - October 13, 2017

 

హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 8792 టీచర్‌ కొలువుల భర్తీకి తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటి భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. దీంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. టీచర్‌ కొలువుల కోసం రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా అన్ని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తుందని అంతా భావించారు. కానీ మూడేళ్లైనా సర్కార్‌ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది.

30కి మించి ప్రకటనలు..
మూడేళ్లలో డీఎస్సీ అదిగో ... ఇదిగో.. అంటూ ప్రభుత్వం 30కి మించి ప్రకటనలు గుప్పించింది. కానీ నేటి వరకు నోటిఫికేషన్‌ విడుదలే కాలేదు. విద్యాశాఖ మంత్రిగానీ, సీఎం కేసీఆర్‌గానీ కొత్త జిల్లాలతో టీచర్‌ కొలువులకు ఇబ్బంది తలెత్తుతోందని చెప్తూ వచ్చారు. మరోవైపు నిరుద్యోగులు ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్నారు. దీంతో మొత్తానికి నిరుద్యోగుల ఆందోళనకు దిగివచ్చింది. ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పది రోజుల్లోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్వయంగా ప్రకటించారు. దీంతో టీఎస్‌పీఎస్సీ కూడా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ విధివిధానాలపై కమిషన్‌ సభ్యులు సమావేశమై చర్చించారు. అంతేకాదు.. సిలబస్‌పైనా చర్చ జరిగింది. అయితే దాదాపుగా పాత సిలబస్‌నే కొనసాగించేందుకు పబ్లిక్‌ కమిషన్‌ సభ్యులు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల
ప్రభుత్వం చెబుతున్నట్టు పది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో 10 జిల్లాలకు సంబంధించిన డేటానే సేకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 31 జిల్లాలకు సంబంధించిన డేటా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇందుకు మరో 15 నుంచి 20 రోజుల సమయం పట్టేలా కనిపిస్తోంది. 

Don't Miss