శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోన్న టీటీడీ

20:10 - September 13, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు త్వరలో భక్తులకు కనువిందు చేయనున్నాయి. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. జిల్లా యంత్రాంగంతో కలుపుకొని నలుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
సెప్టెంబర్‌ 22న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబర్‌ 1 వరకూ జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సెప్టెంబర్‌ 22న  జరగనుంది. 23న ధ్వజారోహణంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. అదే రోజు సీఎం చంద్రబాబునాయుడు.. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. చాలా కాలం తరువాత ధర్మకర్తల మండలి లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధమవుతోంది. 
వివిధ వాహనాలపై స్వామివారు ఊరేగింపు 
ఉత్సవాలు జరిగే 9 రోజులు స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ.. భక్తులకు దర్శనమివ్వడం ఈ ఉత్సవాల ప్రత్యేకత. ఆ రోజుల్లో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని.. వాహన సేవల్లో పాల్గొనాలని భక్తులు కోరుకుంటుంటారు. గరుడ సేవ రోజున 4 నుండి 5 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
ప్రభుత్వం బ్రహ్మోత్సవాలకు ముందు టీటీడీ ధర్మకర్తల మండలి నియామకం పట్ల మొగ్గు చూపడం లేదు. ఉత్సవాల తరువాతే కొత్త పాలకమండలిని నియమిస్తారని చర్చించుకుంటున్నారు. ఇక టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు రూ. 8 కోట్ల కేటాయింపు 
బ్రహ్మోత్సవం ఏర్పాట్లకు మొత్తం 8 కోట్లు కేటాయించారు. కొత్తగా తయారు చేసిన ఏడు అడుగుల సర్వభూపాల వాహనంలో.. ఈ ఏడాది స్వామివారిని ఊరేగించనున్నారు. దసరా సెలవులకు తోడు తమిళ భక్తులు పరమ పవిత్రంగా భావించే పెరటాశి నెల కూడా బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉండడంతో.. భక్తులు ఎక్కువగా వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. 

Don't Miss