తిరుమలలో ఎల్‌1 దర్శనాలకు బ్రేక్

08:16 - September 9, 2017

చిత్తూరు : తిరుమలేశుని సన్నిధిలో.. ఎల్‌1 బ్రేక్‌ దర్శనాల నిలిపివేత.. సత్ఫలితాలనే ఇస్తోంది. అక్రమార్కులకు ముకుతాడు వేయడమే లక్ష్యంగా.. టీటీడీ ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలను నిలిపివేసింది. ప్రభుత్వం కూడా అనుమతించడంతో.. బుధవారం నుంచి.. ఎల్‌1 దర్శనాలకు బ్రేక్‌ పడింది.  
3 రోజులుగా నిలిచిన ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్‌1 బ్రేక్‌ దర్శనాలు.. మూడు రోజులుగా నిలిచిపోయాయి. శ్రీనివాసుని అతి సమీపం నుంచి చూసే అవకాశంతో పాటు.. స్వామి వారి హారతిని, తీర్థం, శఠారిలను దర్శించి, స్పర్శించే వీలు ఈ ఎల్‌1 బ్రేక్‌ దర్శనాల వల్ల కలుగుతుంది. దర్శనానికి వచ్చే వీఐపీల ప్రాముఖ్యతను బట్టి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 బ్రేక్‌ దర్శనం టికెట్లను కేటాయించేవారు. ఎల్‌1 లో దర్శనం చేసుకునే వారికి అధికారులు రాచమర్యాదలు చేస్తారు. ఈ టికెట్లు పొందిన వారు కనీసం 5 నిముషాలపాటు స్వామివారి ముందు నిలబడి సంతృప్తికరంగా దర్శనం చేసుకునే వీలుండేది. అందుకే ఈ టికెట్లకు ఇంత డిమాండ్‌ ఉంది. 
రూ.500 టికెట్‌ను రూ.10వేలకు బ్లాక్‌లో విక్రయం
దేవస్థానంలో ఎల్‌1 టికెట్లకు ఉన్న డిమాండ్‌ను కొందరు అక్రమార్కులు ధనార్జన మార్గంగా మలచుకున్నారు. అయిదు వందల రూపాయలున్న ఒక్కో టికెట్‌ను దాదాపు 10 వేల రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేవారు. ఎల్‌1 టికెట్లను బ్లాక్‌లో విక్రయించే వ్యవహారాలు నిర్వహిస్తూ.. ఈ ప్రాంతంలో కొందరు దళారులు కోట్లకు పడగలెత్తారంటే.. ఇదెంతటి లాభసాటి వ్యవహారమో ఇట్టే అర్థమవుతుంది. టీటీడీ అందించే ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్లను బ్లాక్‌లో అమ్మడంతో పాటు.. ఇతరత్రా మార్గాల ద్వారా కూడా దొంగ టికెట్లను సృష్టించి.. భక్తులకు విక్రయించేవారని టీటీడీ గుర్తించింది. ఒరిజినల్‌ ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల కొనుగోలుదారులతో పాటు.. ఇలా నకిలీ టికెట్లు కొన్నవారూ.. హారతి, తీర్థ సేవలకు తరలి వస్తుండడంతో.. టీటీడీపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. 
ఎల్‌1 బ్రేక్ దర్శనం టికెట్లు రద్దు చేయాలని అధికారుల నిర్ణయం
పరిస్థితిని సమీక్షించిన టీటీడీ అధికారులు.. ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికీ నివేదించారు. దీనిపై ప్రభుత్వం నుంచీ సానుకూల స్పందన రావడంతో.. టీటీడీ గత బుధవారం నుంచి ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని నిలిపివేసింది. ప్రోటోకాల్‌ వీఐపీలకు మినహా సిఫార్సు ఉత్తరాలకు ఇచ్చే బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీని దేవస్థానం నిలిపివేసింది. 
భక్తులకు మరింత వెసులుబాటు 
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఎల్‌1 బ్రేక్‌ దర్శనం టికెట్ల జారీ నిలిపివేయడంతో సిఫార్సు ఉత్తరాలతో తిరుమల వచ్చే వీఐపీలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే, అదే సమయంలో, శ్రీవారిని దర్శించుకునే సాధారణ భక్తులకు మరింత వెసులుబాటు కలిగింది. గతపాలక మండలి ఉన్న రోజుల్లోనే ఎల్‌3 దర్శనాన్ని రద్దు చేశారు. ఇప్పటివరకు ఎల్‌1, ఎల్‌2 బ్రేక్‌ దర్శనం మాత్రమే ఉండేది. ఇక ఎల్‌1 బ్రేక్‌ టికెట్లను కేవలం ప్రోటోకాల్‌ వారికి మాత్రమే కేటాయిస్తుండడంతో..  ఇప్పుడు ఎల్‌ 2 టికెట్ల కోసం సిఫార్సు ఉత్తరాలు పెరుగుతున్నాయి. దళారులు ఈ లేఖలతో ఎలాంటి సరికొత్త అక్రమాలకు తెరతీస్తారోనని టీటీడీ అధికారులు ఇప్పటినుంచే నిఘా పెట్టారు. మొత్తానికి, ఎల్‌1 బ్రేక్‌ దర్శనం నిలపివేతతో.. తమలాంటి మరికొందరికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలగడం పట్ల  సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss