అజ్ఞాతంలో 'సంతానం'..

10:48 - October 11, 2017

తమిళ నటుడు 'సంతానం' ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనపై హత్యా బెదిరింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. 'సంతానం'ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కోలీవుడ్ లో కలకలం రేగుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా 'సంతానం' ఎదిగారు. హీరోగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. నగర శివారులోని కోపూర్ మూండ్రాం కట్టళైలో కళ్యాణ మండపం నిర్మించాలని కాంట్రాక్టర్ షణ్ముగ సుందరంతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కొంత డబ్బును షణ్ముగ సుందరం కు 'సంతానం' ఇచ్చినట్లు టాక్. కానీ మండపం నిర్ణయాన్ని ఇద్దరూ విరమించకోవడంతో తన డబ్బులను వెనక్కి ఇవ్వాలని 'సంతానం' కోరారు. కొంత ఇచ్చినా మిగతా డబ్బు ఇవ్వడానికి కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలో తన మేనేజర్ తో కలిసి వలసరవాక్కంలోని షణ్ముగ కార్యాలయానికి 'సంతానం' వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం..ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఘర్షణకు దారి తీసింది. ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది ప్రేమ్ ఆనంద్ పై కూడా దాడి జరిగిందని తెలుస్తోంది. ఈయన బీజేపీ నేత కావడంతో రాజకీయ రంగు పులుముకుంది.

తనపై నటుడు 'సంతానం' దాడి చేసి గాయపరిచినట్లు గుత్తేదారుడు షణ్ముగ సుందరం వళసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే 'సంతానం'పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి వళసరవాక్కం పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. మంగళవారం ఉదయం 'సంతానం'పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటన తమిళ చిత్రపరిశ్రమలో అలజడి సృష్టించింది. 

Don't Miss