సుప్రీం ఆవరణలో తమిళ రైతు ఆత్మహత్యాయత్నం...

14:29 - May 3, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేగింది..తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేస్తూ సుప్రీంలో ఆందోళన చేపట్టారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం నడుస్తోంది.

కావేరీ నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసినా కేంద్రం అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు కర్నాటక ఎన్నికలను సాకుగా చూపుతోంది. శుక్రవారం ఉదయం కొంతమంది రైతులు సుప్రీంకోర్టు ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమకు సుప్రీంకోర్టు న్యాయం చేయాలని..సుప్రీం చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు 4 టీఎంసీల నీటిని ఇంకా కేటాయించడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ రైతు చెట్టు ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించాడు. వెంటనే సుప్రీంకోర్టు సిబ్బంది అతనిని శాంతింప చేశారు. రాజకీయాలతో సంబంధం లేదని..వెంటనే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వివరణ ఇవ్వాలని సుప్రీం సూచించింది. 

Don't Miss