మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయం

19:54 - February 17, 2017

చెన్నై : తమిళనాడులో అటు అన్నాడీఎంకే, ఇటు పన్నీరు సెల్వం వర్గం ఇద్దరూ అమ్మ వారసత్వంపై పోరాటం చేస్తూ..తమిళనాడు రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారు. శశికళ, సీఎం పళనిస్వామి సహా నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 30 మంది మంత్రులపై పన్నీరు సెల్వం వర్గం పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసింది. వీరే కాకుండా దినకరన్‌, ఎస్‌ వెంకటేశ్‌లను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మధుసూదనన్‌ తెలిపారు.  అయితే సీఎం పళనిస్వామి వర్గం నుంచి తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వానికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించడంతో తమిళ రాజకీయాలు మరింత హీటెక్కాయి. రేపే శాసనసభలో బలపరీక్ష ఉండడంతో..ఈ 24 గంటల్లో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బల పరీక్ష సందర్భంగా పన్నీరు సెల్వం తాజాగా అసెంబ్లీ స్పీకర్‌తో భేటీ అయ్యారు. రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ఇక శనివారమే బలపరీక్ష ఉండటంతో అన్నాడీఎంకే సభ్యులకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది.  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు పళనిస్వామికి కూడా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ రాజేంద్రన్‌ విప్‌ జారీ చేశారు.మరోవైపు పన్నీర్‌ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి.. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.  మరోవైపు రేపు బలపరీక్ష సందర్భంగా తటస్థంగా ఉండాలని డీఎంకే నిర్ణయించింది. 

 

Don't Miss