సీఎం పదవిపై కొనసాగుతున్న టెన్షన్‌

06:55 - February 15, 2017

చెన్నై: తమిళనాడులో కొత్త సమీకరణాలు మొదలవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్ష పడడంతో.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అనంతరం పళనిస్వామి.. పది మంది మంత్రులతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావును కలుసుకున్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. తనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.

ఎత్తుకు పై ఎత్తులో ఇరువర్గాలు...

ఇక శశికళ వర్గం తాజా వ్యూహాలకు అనుగుణంగా పన్నీర్‌ సెల్వం కూడా దూసుకెళ్తున్నారు. మరోవైపు శశికళకు కోర్టు శిక్ష విధించడంతో పన్నీరు శిబిరంలో సంబరాలు జరుపుకున్నారు. ఇక శశికళ వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పన్నీర్‌ గూటికి చేరారు. మరికొంత మంది కూడా వస్తారని పన్నీర్‌ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక పన్నీర్‌సెల్వం వర్గీయులు మైత్రేయన్‌, పాండ్యన్‌ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానించాలని కోరారు.

పన్నీరుకు దీప మద్దతు...

ఇక మొదటినుంచి శశికళపై గుర్రుగా ఉన్న జయలలిత మేనకోడలు దీప తాజాగా పన్నీర్‌ వర్గంలో చేరారు. జయ సమాధి వద్దకు పన్నీర్‌ సెల్వంతో కలిసి వచ్చి నివాళులర్పించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని.. పన్నీర్‌ సెల్వంతో కలిసి పార్టీ కోసం పని చేస్తానని ఆమె ప్రకటించారు. అనంతరం పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన దీప.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారోనన్న టెన్షన్‌ నెలకొంది.

Don't Miss