టెకులపల్లి ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలి

21:31 - December 27, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ హైదరాబాద్‌- సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన సభ జరిగింది. వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈ సభకు హాజరయ్యారు. తమ వారిని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.ప్రతిఘటన సభలో పాల్గొన్న టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం.. తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ యధేచ్చగా చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఇందుకు సాక్ష్యమే టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ అని చెప్పారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎవరినైనా పోలీసులు అరెస్ట్‌ చేసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు, న్యాయమూర్తులకు తెలిసేలా మెసేజ్‌లు పెట్టాలని మాజీ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు
టేకులపల్లి ఎన్‌కౌంటర్‌ ప్రభుత్వ హత్యేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్‌ చేసి .. వారిపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురు ఉన్నారని.. వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను నొక్కేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్ల మీద జ్యూడీషియరీ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలన్నారు.

హిందూత్వ శక్తులు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రచేస్తున్నాయని టీ మాస్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. ప్రజాస్వామికవాదులంతా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు.

నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు
నేరెళ్ల ఘటన జరిగిన ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నంద్యాల నర్సింహ్మారెడ్డి అన్నారు. ముగ్దూం భవన్‌లో నేరెళ్ల బాధితులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులు తమను చావకొట్టినా తమ ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందింలేదని నేరెళ్ల బాధితుడు బాణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల రక్షణలో నేటికీ ఇసుకమాఫియా ఆగడాలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, కేసీఆర్‌ సర్కార్‌కు సరైన సమయంలో బుద్దిచెప్తామన్నారు.తెలంగాణలో ప్రజాస్వామిక వాతావారణం కోసం అందరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపజేశాయి.

Don't Miss