మరణంలోనూ వీడని బంధం

09:22 - October 9, 2017

హైదరాబాద్ : కట్టుకోబోయే వాడే కాలయముడయ్యాడు. పెళ్లికి ముందే సూటిపోటి మాటలతో అనుమాన పిశాచిగా తయారయ్యాడు. నువ్వు తప్ప నా జీవితానికి మరో ఆప్షన్‌ లేదని ఆ యువతి ఎంతచెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ తన నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. తన స్నేహితురాలు ఇక లేదని తెలియడంతో మరో ట్రెయినీ కానిస్టేబుల్‌ బలవంతంగా తనువు చాలించింది. రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకొంది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజపేటకి చెందిన పార్వతమ్మ పర్వతాలు దంపతుల కూతురు మాధవి. 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. అప్పటినుంచి వేములపల్లి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. గత మూడు నెలల క్రితం మాధవికి మునుగోడు మండలానికి చెందిన రామచంద్రం అనే వ్యక్తితో వివాహంనిశ్చయమైంది. దీపావళి తర్వాత ఇరువురికి వివాహం జరపించాలని.. రెండు కుటుంబాలు నిర్ణయించాయి. అప్పటి నుంచి మాధవి, రామచంద్రంతో కాస్త చనువుగా ఉండేది. అయితే ఆ చనువును రామచంద్రం అపార్థం చేసుకున్నాడు. మాధవి పట్ల అనుమానం పెంచుకొని చీటికిమాటికి సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నిత్యం ఫోన్‌ చేయాలని వేధించేవాడని.. తాను ఫోన్‌ చేసినప్పుడు తీయకపోతే ఎవరితో మాట్లాడుతున్నావ్‌ అంటూ అనుమానించడం మొదలుపెట్టాడని మాధవి తల్లిదండ్రులు చెబుతున్నారు.

కేవలం మాటలతో ఆగలేదు రామచంద్రం. తనతో కలిసి దిగిన ఫోటోలను బంధువులకు పంపుతూ సూటిపోటి మాటలతో మానసిన హింసకు దిగాడు. దీంతో కుంగిపోయిన మాధవి తన గోడును కన్నవారికి చెప్పుకోలేక వేములపల్లిలో అద్దెకు ఉంటున్న గదిలో ఫ్యాన్స్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నేను మరెవరినీ ప్రేమించడంలేదని .. నన్నేందుకు మోసం చేశావంటూ డైరీలో రాసిన సూసైడ్‌ నోట్‌ ఆమె గదిలో లభించింది. తమ కూతురి మృతికి రామచంద్రం వేదింపులే కారణమని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

మాధవి ఆత్మహత్యను తట్టుకోలేక పోయిన ఆమె స్నేహితురాలు నవీన అర్ధాంతరంగా తనువుచాలించింది. నవీన హైదరాబాద్‌ లోని  రాజబహుద్దూర్‌ పోలీసు అకాడమీలో కానిస్టేబుల్‌ శిక్షణలో ఉంది. డిసెంబర్‌లో శిక్షణ ముగియనుంది. నవీన, మాధవి ఇద్దరు ప్రాణస్నేహితులు. గత ఏనిమిదేళ్లుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.  మాధవి విషయం నవీనకు తెలిసే లోపు ఆమెను తీసుకురావాలనుకున్నామని.. కానీ ఆ లోపు ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వివాహానికి ముందే జీవితం పంచుకోవాల్సిన యువతిపై రామచంద్రం పెంచుకున్న అనుమానం రెండు నిండు జీవితాలను బలితీసుకుందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

Don't Miss